Mahaa Daily Exclusive

  సీజేపీ స్ఫూర్తితో..తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ఆవిర్భావం..

Share

  • సీజేపీ స్ఫూర్తితో
  • తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ఆవిర్భావం
  • ప్రకటించిన నిరుద్యోగ జేఏసీ, పోలీసు జేఏసీ
  • సీఎం వ్యాఖ్యలే మా నిర్ణయానికి కారణమన్న నేతలు

హైదరాబాద్, మహా : దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తెలంగాణలో నిరుద్యోగ యువతకు కొత్త స్ఫూర్తిని నింపింది. తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు నిరుద్యోగ జేఏసీ, పోలీస్ జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన.. మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కాదు అనే వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆవేదనను రాజకీయ వేదికపై వినిపించేందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఎండ్రిన్ పార్టీ ప్రధాన డిమాండ్లు ఇవే

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎండ్రిన్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి. పారదర్శకంగా, జాబ్ క్యాలెండర్‌తో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టాలి.

సూర్యాపేటలో ఆవిర్భావ సభ

తెలంగాణ ఎండ్రిన్ పార్టీని ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసిన తర్వాత.. రాష్ట్రంలో ఉద్యమాల పురిటి గడ్డగా పేరొందిన ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. మారోజు వీరన్న స్థూపం వద్ద పార్టీ లోగోను ఆవిష్కరించి తొలి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రధాన ప్రతినిధులుగా నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, ఆకాశ్ నవీన్ పట్నాయక్, శంకర్, కుమార్ నాయక్, శింబు, వంశీ, చెర్రి ప్రవీణ్, సోమేశ్, జీ ప్రవీణ్ వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పార్టీని అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి సీఎం రేవంత్‌రెడ్డి గతంలో మద్దతు తెలిపారని.. కానీ తెలంగాణలో గత 50 రోజులుగా నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.