Mahaa Daily Exclusive

  14 న విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Share

  • దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి
  • అక్టోబర్ 16న అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
  • పది రోజుల పాటు రూ.100, రూ.300, రూ.500 దర్శన టికెట్లు రద్దు

విజయవాడ, మహా : ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. అక్టోబర్ 14వ తేదీన ఆమె దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. రాష్ట్రపతితో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 16న మూలా నక్షత్రం రోజున ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలకు సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాలు జరిగే పది రోజుల పాటు రూ.100, రూ.300, రూ.500 ధర గల దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేసింది. కేవలం ఉచిత దర్శనంతో పాటు, త్వరితగతిన దర్శనం కోరుకునే వారి కోసం రూ.1000 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ టికెట్లను ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలకు సమయం కేటాయించినట్లు ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. రద్దీని బట్టి సాయంత్రం వేళ కూడా వీఐపీ దర్శనాలకు మరో స్లాట్ కేటాయించే అవకాశం ఉందని వివరించారు. భక్తుల కోసం భారీ క్యూ కాంప్లెక్స్‌లు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు.