మూసీ తీరంలో ఆధ్యాత్మిక శోభ.
*’రూ.1,108 కోట్లతో మహా ప్రాజెక్టు.
* మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయానికి మహర్దశ.
• సాంకేతిక మార్గదర్శకత్వం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.
హైదరాబాద్,మహా:
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మూసీ తీరంలో ఆధ్యాత్మిక, పర్యాటక శోభను ద్విగుణీకృతం చేసేలా గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. ఆలయ సమగ్ర అభివృద్ధితో పాటు అద్భుతమైన కనెక్టివిటీ కోసం ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి మొత్తం రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ బుధవారం G.O.Rt.No.928 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
భవిష్యత్తులో అత్యంత ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధి పనులకు ఏకంగా రూ.948.65 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణంలో భారీ రాజగోపురాలు, విశాలమైన యాగశాల, సుందరమైన పుష్కరిణితో పాటు భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఈ నిధులతో నిర్మించనున్నారు. ఈ పవిత్ర క్షేత్రానికి భక్తులు సులభంగా చేరుకునేందుకు వీలుగా మరో రూ.159.62 కోట్లతో 30 మీటర్ల (100 అడుగుల) వెడల్పుతో ఆరు లేన్ల రహదారిని నిర్మించనున్నారు. ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు సుమారు 2.50 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం సాగనుంది. ఈ కొత్త రహదారిని గ్రేహౌండ్స్ దళాల కేంద్రం, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలకు అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల మూసీ రివర్‌ఫ్రంట్ రోడ్ నెట్‌వర్క్‌తో ఓంకారేశ్వర ఆలయానికి అత్యుత్తమ కనెక్టివిటీ ఏర్పడనుంది.
మరోవైపు, ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఆలయ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా, సాంప్రదాయ బద్ధంగా నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రధాన ఆలయ పనులకు పూర్తి సాంకేతిక మార్గదర్శకత్వం అందించేందుకు ఒక ప్రత్యేక ‘టెక్నికల్ కమిటీ’ని ఏర్పాటు చేస్తూ G.O.Rt.No.929 ఉత్తర్వులు జారీ చేసింది. భవన నిర్మాణ నమూనాలు (డిజైన్లు), సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు), ధరల ఖరారు, టెండర్ల ప్రక్రియ వంటి అత్యంత కీలకమైన బాధ్యతలను ఈ కమిటీకి అప్పగించింది.
ఈ టెక్నికల్ కమిటీలో వివిధ విభాగాలకు చెందిన అత్యున్నత అధికారులను, నిపుణులను భాగస్వాములను చేశారు. రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పబ్లిక్ హెల్త్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ కో-ఛైర్మన్‌గా, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్, ప్రముఖ ఆలయ ఆర్కిటెక్చర్ నిపుణుడు డాక్టర్ ఈ. శివనాగిరెడ్డి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఈ ఉన్నత స్థాయి కమిటీలో సభ్యులుగా సేవలందించనున్నారు.








