Mahaa Daily Exclusive

  ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం….

Share

ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం.
* రూ.500 కోట్ల కుచ్చుటోపీ.
* త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై సీసీఎస్‌లో బాధితుల ఫిర్యాదు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. ప్రీ లాంచ్ (ఫ్రీ లాంచ్) ఆఫర్ల పేరుతో అమాయక కొనుగోలుదారులకు వల వేసిన ఓ నిర్మాణ సంస్థ వందల కోట్ల రూపాయలు దండుకుని బోర్డు తిప్పేసింది. నగరానికి చెందిన ‘త్రిపుర కన్‌స్ట్రక్షన్స్’ సంస్థ సుమారు 350 మంది నుంచి ఏకంగా రూ.500 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులను ఆశ్రయించారు. సంస్థ కీలక నిర్వాహకుడు పసుపులేటి సుధాకర్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని నమ్మబలకడంతో ఆశపడిన అనేక మంది సామాన్యులు తమ జీవితకాల పొదుపును ఈ సంస్థలో పెట్టుబడిగా పెట్టారు. మోసపోయిన బాధితుల్లో అత్యధికంగా ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) మాజీ ఉద్యోగులతో పాటు, ఐటీ రంగంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉండటం గమనార్హం. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకుండా సంస్థ యాజమాన్యం కొన్నేళ్లుగా కాలయాపన చేస్తూ వస్తోందని బాధితులు వాపోతున్నారు. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో లక్షల రూపాయలు చెల్లించిన తాము ఇప్పుడు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు నిర్మాణ పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తున్న త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యం.. మరోవైపు ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమిని గుట్టుచప్పుడు కాకుండా వేరొక సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొనుగోలుదారులు తీవ్ర ఆగ్రహానికి గురై సంస్థ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మోసపూరిత ఆఫర్లతో నిధులు వసూలు చేసి, ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు యత్నిస్తున్న యాజమాన్యంపై మోసం కింద కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇటువంటి ప్రీ లాంచ్ ఆఫర్ల స్కామ్‌లు అమాయక కొనుగోలుదారుల పాలిట శాపంగా మారుతున్నాయి.