Mahaa Daily Exclusive

  పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ…..సీఎస్‌ సంజయ్‌ జాజు.

Share

హైదరాబాద్, మహా:
రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో, అత్యంత సమర్థంగా పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. దేశంలోనే తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
కొత్తగా పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత వేగవంతంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను సత్వరమే కల్పించాలని అధికారులకు సీఎస్ సూచించారు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారితో పాటు, రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వివిధ సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలన్నారు. పారిశ్రామికవేత్తల నుంచి వచ్చే ప్రతిపాదనలను వేగంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలోగా అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను వేగవంతం చేసేందుకు వివిధ శాఖల మధ్య పకడ్బందీ సమన్వయం ఉండాలని మార్గనిర్దేశం చేశారు.
ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కీలక వేదిక కానుందని సంజయ్ జాజు వెల్లడించారు. రాబోయే రోజుల్లో పెట్టుబడుల ఆకర్షణ, నూతన పరిశ్రమల స్థాపన, తద్వారా భారీ స్థాయిలో ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని ఆయన అధికారులకు ఉద్బోధించారు. అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం విదేశాల్లో సైతం రోడ్‌షోలు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. పెట్టుబడుల సాధన కోసం ఈ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అధికారులకు సీఎస్ చేసిన దిశానిర్దేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.