Mahaa Daily Exclusive

  హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో కడియం రైతులదే కీలకపాత్ర…. ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు.

Share

రాజమహేంద్రవరం,మహా.
రాష్ట్రాన్ని పచ్చదనం పరుచుకున్న హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో కడియం నర్సరీ రైతుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరం పరిధిలోని కడియంలో ‘సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో జరిగిన రైతుల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల దార్శనికతకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలను ఆయన రైతులకు వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా నాగబాబు రాజమహేంద్రవరంలోని పుష్కర నగరవనాన్ని సందర్శించి, అక్కడ పవిత్రమైన రుద్రాక్ష మొక్కలతో పాటు అత్యంత అరుదైన అండమాన్‌ పడాక్‌ (Andaman Padauk) మొక్కలను స్వయంగా నాటారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కడియం నర్సరీలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొక్కల పెంపకంలో రైతులు అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులు, వారు ఎదుర్కొంటున్న సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు వంటి అంశాల్లో కడియం రైతుల అపార అనుభవం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు.
వచ్చే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను నాగబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకుందని, ఈ బృహత్తర లక్ష్య సాధనకు రాష్ట్రవ్యాప్తంగా 500 నుంచి 1,000 నర్సరీల అవసరం ఉంటుందని ఆయన అంచనా వేశారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా జియో ట్యాగింగ్, డిజిటల్ రికార్డులు వంటి పారదర్శక సాంకేతిక విధానాలను అమలు చేయనున్నట్లు ఆయన గతంలోనే స్పష్టం చేసిన విషయం విదితమే. ఎక్కడ నాటాం, ఎన్ని బతికాయి అనే దానికి కచ్చితమైన సమాధానం ఉండేలా పకడ్బందీ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ హరిత యజ్ఞంలో భాగస్వాములయ్యే నర్సరీ రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని నాగబాబు భరోసా ఇచ్చారు. నర్సరీ రంగంపై ఆధారపడిన రైతులకు భవిష్యత్తులో స్థిరమైన, లాభదాయకమైన మార్కెట్‌ అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొక్కల పెంపకాన్ని కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా భవిష్యత్తు తరాలకు మనం అందించే స్వచ్ఛమైన ప్రాణవాయువుగా భావించాలని, ప్రభుత్వ సంకల్పానికి ప్రజలు, రైతులు పూర్తి మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు.