Mahaa Daily Exclusive

  కుప్పంకు నీళ్లు.. పాలమూరుకు కన్నీళ్లు!

Share

కుప్పంకు నీళ్లు.. పాలమూరుకు కన్నీళ్లు!
• ఏపీ సీఎంకు తెలంగాణ జలాలను ‘గిఫ్ట్‌ ప్యాక్’ చేసి ఇస్తున్న రేవంత్‌రెడ్డి.
* కరవు మండలాలను తక్షణమే ప్రకటించాలి.
* రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కృష్ణా నది జలాలను పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దారాదత్తం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మన నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ‘గిఫ్ట్ ప్యాక్‌’ చేసి పంపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఫలితంగా కుప్పంకు కృష్ణా జలాలు పారుతున్నాయని, కానీ సొంత రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ (పాలమూరు) రైతాంగానికి మాత్రం చుక్క నీరు అందక కన్నీళ్లు మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేయడం వల్లే రాష్ట్రం నేడు కరవు కోరల్లో చిక్కుకుందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని, తక్షణమే కరవు బారిన పడిన మండలాలను అధికారికంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావంతో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే పదేపదే హెచ్చరించినప్పటికీ, కాంగ్రెస్ సర్కారు ఆదమరిచి నిద్రపోయిందని, కనీస నివారణ చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కనీసం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ కరవు మండలాల ఊసు ఎత్తకపోవడం రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి, చిత్తశుద్ధి లోపానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు.
కృష్ణా, గోదావరి నదుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పాలమూరు-రంగారెడ్డి తదితర ఎత్తిపోతల పథకాలను పట్టించుకోకుండా మన నీటిని ఏపీకి తరలిస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నార్లాపూర్ రిజర్వాయర్‌పై కొంత నిధులు వెచ్చించి నింపి ఉన్నా, ఈపాటికి కల్వకుర్తి ఆయకట్టుకైనా నీరందేదని, తద్వారా భూగర్భ జలాలు కూడా పెరిగేవని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అప్రకటిత కోతలు విధిస్తూ కేవలం ఆరేడు గంటల కరెంటుతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. ఈ విద్యుత్ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. సాగునీరు, కరెంటు లేక వ్యవసాయం కుదేలవడమే కాకుండా.. రాజధాని హైదరాబాద్‌తో సహా ప్రధాన పట్టణాల్లో ఇప్పటికే తీవ్ర తాగునీటి ఎద్దడి మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. కరవుతో విలవిలలాడుతున్న రైతులకు, రాష్ట్ర ప్రజలకు తమ పార్టీ సంపూర్ణ అండగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాడేందుకు 60 నియోజకవర్గాల్లో తమ పార్టీ ఇన్‌చార్జ్‌లు నిరంతరం శ్రమిస్తారని కవిత ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.