పేదల గృహనిర్మాణంలో సరికొత్త శకం.
* దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక 3డీ కాంక్రీట్.
* ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. గృహ నిర్మాణ రంగంలో ఒక సరికొత్త విప్లవానికి తెరతీస్తూ, దేశంలోనే తొలిసారిగా గ్రామీణ గృహనిర్మాణంలో అత్యాధునిక ‘త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్’ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలోని బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్లు సంయుక్తంగా ఈ వినూత్న పైలట్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ 2.0 (పీఎంఏవై-జీ) పథకం కింద నూతనంగా మంజూరైన ఏకంగా మూడు లక్షల గృహ నిర్మాణాలకు ఇదే వేదికగా వారు శంకుస్థాపన చేయడం విశేషం. అవాంతరాలు లేని వేగవంతమైన, పటిష్టమైన ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీబీఆర్ఐ) సహకారంతో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది.
సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేసే ఈ త్రీడీ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు కింద తెనాలి మండలంలోని బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా 177 ఇళ్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అంచనా వ్యయం సుమారు రూ.14 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.9.44 కోట్లు భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.4.49 కోట్లను వెచ్చిస్తోంది. సాధారణ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే ఈ త్రీడీ ప్రింటింగ్ విధానంలో అత్యంత వేగంగా నిర్మాణాలను పూర్తి చేయవచ్చు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఆధారిత రోబోటిక్ ప్రింటర్ ద్వారా ముందుగానే రూపొందించిన ఆకృతికి అనుగుణంగా కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలు పొరలుగా పేర్చుతూ గోడలను నిర్మిస్తారు. ఈ పద్ధతిలో సెంటరింగ్ సామగ్రి అవసరం ఉండదు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, సాధారణ ఇళ్ల నిర్మాణంతో పోలిస్తే సుమారు 50 నుంచి 70 శాతం వేగంగా ఇల్లు పూర్తవుతుంది. అలాగే నిర్మాణ సామగ్రి వృథాను 30 నుంచి 60 శాతం వరకు అరికట్టవచ్చు. వేసవి ఎండ తీవ్రతను సైతం తట్టుకుని ఇళ్ల లోపల చల్లని వాతావరణం ఉండేలా ఈ నూతన సాంకేతికతను డిజైన్ చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు.
పేదలకు కేవలం ఐదు రోజుల్లోనే ఒక పటిష్టమైన ఇంటిని అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్లు పలువురు లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి సంతోషాన్ని పంచుకున్నారు. గడిచిన 28 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన కూటమి ప్రభుత్వం, ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న మరో 4.20 లక్షల గృహాలను రాబోయే మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి పంపిణీ చేయాలని స్పష్టమైన లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. వినూత్న సాంకేతికతతో కూడిన ఈ బృహత్తర ప్రాజెక్టు విజయవంతమైతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల సొంతింటి కల అతి తక్కువ సమయంలోనే, అత్యంత నాణ్యతతో సాకారం కానుంది.








