Mahaa Daily Exclusive

  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం… తెలంగాణ మహిళ దుర్మరణం….

Share

 

మహబూబాబాద్‌,మహా.

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ (31) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఉద్యోగరీత్యా కుటుంబంతో సహా మిస్సోరిలో నివసిస్తున్న సుప్రియ, అక్కడ ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి విధులు ముగించుకుని, రెస్టారెంట్‌ను మూసివేసిన అనంతరం తన స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక ట్రక్కు అత్యంత బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి కారు తీవ్రంగా ధ్వంసం కాగా, తీవ్ర గాయాల పాలైన సుప్రియ ఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడిచారు. అదే కారులో ప్రయాణిస్తున్న మరో భారతీయ యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సుప్రియ భర్త కొడుమూరి రంజిత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరికి ఆదిత్య అనే చిన్న కుమారుడు ఉన్నాడు. సుప్రియ అత్తమామలైన కొడుమూరి వెంకటేశ్వర్లు, రాధిక మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం అమెరికా నుంచి ఈ విషాద వార్త తెలియడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నతస్థాయికి ఎదుగుతారని భావించిన బిడ్డ ఇలా అర్థాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో సుప్రియ స్వగ్రామం మరిపెడలో, మహబూబాబాద్ పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రస్తుతం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికాలోని అధికారిక లాంఛనాలు పూర్తిచేసి, సుప్రియ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించి అంత్యక్రియలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతూ వేడుకుంటున్నారు.