Mahaa Daily Exclusive

  వృద్ధులకూ ఉచిత బస్సు ప్రయాణం!

Share

వృద్ధులకూ ఉచిత బస్సు ప్రయాణం!
* త్వరలో తీపికబురు అందించనున్న రేవంత్ సర్కార్.
* సానుకూలంగా పరిశీలిస్తున్నామని వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
హైదరాబాద్, మహా.
తెలంగాణలోని వయోవృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపికబురు అందించేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఇకపై సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు ప్రారంభించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో వృద్ధుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.
మహిళలతో పాటు వృద్ధులందరికీ (పురుషులతో సహా) ప్రయోజనం చేకూర్చేలా ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలులోకి తీసుకువస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అత్యంత సానుకూలంగా పరిశీలిస్తున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వృద్ధులకు ప్రయాణ భారం తప్పనుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆసుపత్రులకు వెళ్లేందుకు, పుణ్యక్షేత్రాల దర్శనానికి, అలాగే బంధువుల ఇళ్లకు సులువుగా ప్రయాణించేందుకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు పడే సీనియర్ సిటిజన్లకు ఇది పెద్ద వరంలా మారనుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 32.69 లక్షల మంది వృద్ధులు ఉండగా, ఆ సంఖ్య ప్రస్తుతం అంచనాల ప్రకారం సుమారు 48 లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు 12.5 శాతం మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వీరికి సామాజిక భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేయూత (ఆసరా) పెన్షన్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దీనికి అదనంగా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే వృద్ధులకు ప్రభుత్వ పరంగా మరింత భరోసా దక్కినట్లు అవుతుందని అధికారుల అంచనా.
అయితే, ఈ వినూత్న పథకం అమలుకు సంబంధించి అర్హతలు, వయో పరిమితి, ఆదాయ నిబంధనలు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టతకు రావాల్సి ఉంది. ప్రభుత్వం త్వరలోనే ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో చర్చించి దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణంతో టీజీఎస్‌ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో, సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తే పడే అదనపు భారాన్ని ఎలా భర్తీ చేయాలనే దానిపై ప్రభుత్వం లోతుగా సమీక్షిస్తోంది. వీటన్నింటిపైనా ఆర్థిక, రవాణా శాఖల సమన్వయంతో స్పష్టమైన విధివిధానాలు ఖరారు చేసిన తర్వాతే వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.