Mahaa Daily Exclusive

  ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

Share

  • కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, కలెక్టరేట్ మహా;

ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్‌లతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 98,539 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

ఇందులో 90,523 ఎకరాల్లో 7 రకాల సన్న వడ్లు, 8,016 ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగు చేసినట్లు తెలిపారు.

వీటి ఆధారంగా సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.

ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 209 ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు (PPCలు) ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు తదితర పరికరాలను ముందుగానే సమకూర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ధాన్యం నిల్వకు సరిపడా గోడౌన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు.

జిల్లాకు సుమారు 37.50 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ఇప్పటివరకు 10 లక్షల గన్నీ బ్యాగులు సమకూరినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన గన్నీ బ్యాగులను కూడా సకాలంలో సమకూర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన అనంతరం సకాలంలో తరలించేందుకు సరిపడా వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల వారీగా అవసరాలను ముందుగానే గుర్తించి, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్,డీఎం సివిల్ సప్లైస్ సంధ్యా రాణి, డీసీఎస్‌ఓ కిష్టయ్య, డీఆర్‌డీఏ నాగ పద్మజ , డీసీఓ నీరజ,, డీఏఓ, ఆర్‌టీఓ, మార్క్‌ఫెడ్ డీఎం, వరంగల్ ఆర్డీఓ సుమ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి సంబంధిత మండలాల ఏపీఎంలు, పీఏసీఎస్ సీఈఓలు, ప్యాడీ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు, ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.