Mahaa Daily Exclusive

  విద్యుత్ శాఖలో ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట – కారుణ్య నియామకాల ద్వారా కూటమి ప్రభుత్వంలో 389 మందికి ఉద్యోగాలు – విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Share

విజయవాడ, సెప్టెంబర్ 16.మహ: రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బుధవారం నాడు గుణదలలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో కారుణ్య నియామక ఉత్తర్వులు అందించే ప్రధాన కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో చేపడుతున్న వివిధ ఉద్యోగ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కారుణ్య నియామకాల ద్వారా 389 మందికి ఉద్యోగాలు కారుణ్య నియామకాల కింద తాజాగా 25 మంది ఉద్యోగార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి అందజేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్ కో, జెన్కో, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో ఇప్పటివరకు మొత్తం 389 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మరణించిన విద్యుత్ శాఖ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగి పిల్లలు చిన్న వయస్సులో ఉన్నా, అర్హత కలిగిన వయస్సుకు వచ్చినా వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన మరో 35 నుంచి 45 మందికి కట్‌ఆఫ్ తేదీని నిర్ణయించి ప్రత్యేకంగా పరిగణించి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

629 ఏఈ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించాం త్వరలో ఫలితాలు అందిస్తామని, విద్యుత్ శాఖలోని అన్ని విభాగాలను కలిపి 629 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు.త్వరలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా నియామక ప్రక్రియను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులకు మూడు డిఏ లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎలక్ట్రిసిటీ విభాగం పనిచేస్తోందన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు మెరుగైన శిక్షణ అందించేందుకు విశాఖపట్నంలో దాదాపు రూ. 30 కోట్ల వ్యయంతో ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్‌ను నిర్మించామని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగులకు నాణ్యమైన శిక్షణ అందించడమే దీని ఉద్దేశమన్నారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సోలార్, విండ్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల కుటుంబాలకు సూర్య ఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా సుమారు రూ. 10,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామకాలతో పాటు ఉద్యోగుల సంక్షేమం, శిక్షణ, పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహం, గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందించారు.

ఈ కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి, డైరెక్టర్ టెక్నికల్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ & హెచ్ ఆర్ టీవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.