Mahaa Daily Exclusive

  ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’తో రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు..!

Share

  • అక్టోబరు 17 వరకు నిర్వహణ
  • కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • అధికారులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశాలు

అమరావతి,మహ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి అక్టోబరు 17 వరకు నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. ‘స్వర్ణ భారత్‌–స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌–2047’ లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నామని భాజపా జాతీయ నాయకుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వైద్య శిబిరాలు జరగనున్నాయి

వైద్య సేవలతో పాటు పథకాలపై అవగాహన

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య పథకాల వివరాలను తెలియజేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆరోగ్య పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను మంత్రి ఆదేశించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు అనుసరించి సేవా సంకల్ప అభియాన్ ద్వారా
దక్షిణాదిన జరిగే కార్యకలాపాలను భాజపా తరఫున మంత్రి సత్య కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

ప్రత్యేక కమిటీ ఏర్పాటు

వైద్య శిబిరాల నిర్వహణకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ చక్రధర్‌బాబు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. శిబిరాల ప్రణాళిక, సమన్వయం, అమలు, పర్యవేక్షణ బాధ్యతలను ఈ కమిటీ చేపట్టనుంది. జిల్లా వారీగా శిబిరాల తేదీలు, ప్రాంతాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, అందించాల్సిన వైద్య సేవలను ఖరారు చేయనుంది. శిబిరాలకు హాజరయ్యే వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. అందించిన వైద్య సేవలు, రోగుల వివరాలను కమిటీ పర్యవేక్షించనుంది. అవసరమైన చోట అధికారులకు సలహాలు, సూచనలు అందించనుంది. శిబిరాలు పూర్తయిన అనంతరం జిల్లాల వారీగా నిర్వహించిన కార్యక్రమాలు, లబ్ధిదారుల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించనున్నారు.
మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ “‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ ద్వారా ప్రజలకు అవసరమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలి. ప్రతి జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేసి శిబిరాలను విజయవంతం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాల సమాచారం ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ శిబిరాల ప్రయోజనం అందేలా చూడాలి” అని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కమిటీకి డాక్టర్‌ బి.వి. సతీష్‌కుమార్‌ (సంయుక్త సంచాలకులు) సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారు. ఉన్నతాధికారులు కె. శ్యామల, డాక్టర్‌ టి. రమేష్‌, డాక్టర్‌ జె. నరసింహ నాయక్‌, డాక్టర్‌ వి.వి.బి. సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ చక్రధర్‌బాబు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జిల్లా వైద్యాధికారులతో కమిషనర్‌ సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వైద్య శిబిరాల నిర్వహణపైకుటుంబ సంక్షేమ కమిషనర్‌ డాక్టర్‌ చక్రధర్‌బాబు బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష జరిపారు. నెల రోజుల పాటు శిబిరాల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, వైద్య సేవల అందజేత, ప్రజలకు అవగాహన కల్పించడం, ముందస్తు ప్రచారం, శిబిరాలకు ప్రజలను సమీకరించడం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శిబిరాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ అవసరమైన పరీక్షలు నిర్వహించి, వ్యాధి ఉన్నట్లు గుర్తించిన వారికి తదుపరి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. శిబిరాల్లో అందించే సేవలు, లబ్ధిదారుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, కార్యక్రమం పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని అధికారులకు తెలిపారు. 104 సంచార వైద్యశాల ద్వారా గ్రామాల్లో జరిగే వైద్య పరీక్షలతో అనుసంధానం జరగాలని చక్రధర్ బాబు అధికారులకు స్పష్టం చేశారు.
వైద్య శిబిరాల నిర్వహణపై మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యేక దృష్టి సారించారని డాక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాల ప్రయోజనాలను అర్హులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.