Mahaa Daily Exclusive

  సాయి విహార్‌లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

Share

పూజల్లో పాల్గొన్న అపార్ట్మెంట్ అధ్యక్షులు భూక్యా భాషా, గౌరవాధ్యక్షులు మండేపూడి వెంకటయ్య

కారేపల్లి,మహా: సాయి విహార్ అపార్ట్మెంట్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అపార్ట్మెంట్ వాసులు భక్తిభావంతో శ్రీ వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేక పూజల నడుమ మండపంలోకి ఆహ్వానించి ప్రతిష్ఠించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలు, వినాయక నామస్మరణలతో అపార్ట్మెంట్ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు భూక్యా భాషా, గౌరవాధ్యక్షులు మండేపూడి వెంకటయ్య శ్రీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నాలను తొలగించి అపార్ట్మెంట్‌లోని ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.

ఉత్సవ కమిటీ అధ్యక్షులు కళ్యాణపు బాబురావు దంపతులు పీటలపై కూర్చుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదపండితులు రవి అయ్యగారి నేతృత్వంలో గణనాథుడికి షోడశోపచార పూజలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించడంతో పాటు భక్తులకు ప్రసాద వితరణ చేపట్టేందుకు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అపార్ట్మెంట్‌లోని ప్రతి కుటుంబం ఉత్సవాల్లో భాగస్వాములై గణనాథుడి ఆశీస్సులు పొందాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. భక్తి, ఐక్యత, ఆధ్యాత్మికతకు ప్రతీకగా సాయి విహార్ అపార్ట్మెంట్‌లో ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.