ఇంటర్ పరీక్షల్లో బట్టీ పద్ధతికి స్వస్తి.
• 2027–28 నుంచి ప్రశ్నపత్రాల సరళిలో సమూల మార్పులు.
• విశ్లేషణ, సృజనాత్మక ఆలోచనలకు పెద్దపీట.
• కొత్త తరహా ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యానికి పరీక్ష.
హైదరాబాద్, మహా:
ఇంటర్మీడియట్ విద్యలో ఏళ్లుగా కొనసాగుతున్న బట్టీ పద్ధతికి స్వస్తి పలికేలా ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం కంఠస్థం చేసి పరీక్షల్లో సమాధానాలు రాసే విధానానికి బదులుగా.. తాము నేర్చుకున్న అంశాలను అర్థం చేసుకుని, విశ్లేషించి, కొత్త పరిస్థితుల్లో అన్వయించే సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నపత్రాల రూపకల్పనలో మార్పులు తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘పరాఖ్’ మార్గదర్శకాలు, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ఇచ్చిన ప్రశ్నల నుంచే ఎక్కువగా పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కంటే ప్రశ్నలు, వాటి సమాధానాలను గుర్తుపెట్టుకుని పరీక్షల్లో రాసే పరిస్థితి ఏర్పడిందని అధికారులు గుర్తించారు. ఈ విధానానికి మార్పు తీసుకురావడం ద్వారా విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ఆలోచనా శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త విధానంలో ప్రశ్నపత్రాల్లో సుమారు 10 శాతం ప్రశ్నలను పూర్తిగా కొత్త తరహాలో రూపొందించనున్నారు. విద్యార్థి పాఠ్యాంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, నేర్చుకున్న విషయాన్ని కొత్త పరిస్థితుల్లో ఎలా ఉపయోగించగలడు, ఒక సమస్యను ఏ విధంగా విశ్లేషించి పరిష్కరించగలడు అనే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేవలం పుస్తకంలోని ప్రశ్నకు సమాధానం గుర్తుపెట్టుకోవడం కాకుండా.. ఆ జ్ఞానాన్ని ఆచరణలో ఉపయోగించే సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలను రూపొందించనున్నారు.
ఈ మార్పుల కోసం ఇంటర్మీడియట్ విద్యామండలి ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కొత్త తరహా ప్రశ్నలను రూపొందించడంలో అధ్యాపకుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వహిస్తోంది. వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి సృజనాత్మకంగా, విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలను అధ్యాపకుల నుంచి సేకరించనున్నారు.
అలా సేకరించిన ప్రశ్నలను నిపుణులు పరిశీలించి ప్రత్యేక ప్రశ్నల బ్యాంకును రూపొందించనున్నారు. అనంతరం వచ్చే విద్యా సంవత్సరం ముద్రించే కొత్త పాఠ్యపుస్తకాల చివర ఈ తరహా ప్రశ్నలను చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలోనే కొత్త విధానానికి అలవాటు పడే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
కొత్త ప్రశ్నల విధానం వల్ల విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతాయని విద్యాశాఖ భావిస్తోంది. పాఠ్యాంశాన్ని కంఠస్థం చేయడం కంటే దాని వెనుక ఉన్న భావనను అర్థం చేసుకోవడం, అవసరమైన సందర్భాల్లో దాన్ని అన్వయించుకోవడం అలవడుతుందని పేర్కొంటున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులను ఉన్నత విద్యతో పాటు పోటీ పరీక్షలు, భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు సిద్ధం చేయడంలో ఈ మార్పులు ఉపయోగపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి మొత్తం ప్రశ్నపత్రాన్ని మార్చకుండా.. దశలవారీగా కొత్త తరహా ప్రశ్నల శాతాన్ని పెంచే దిశగా భవిష్యత్తులో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బట్టీ చదువుకు బదులుగా అర్థం చేసుకుని ఆలోచించే విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.








