- హైదరాబాద్ భవిష్యత్ పాలనకు కొత్త బాట
- బ్లూ, గ్రీన్ సిటీగా నగరం
- 30 ఏళ్ల అవసరాలే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మహా : హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నగరాన్ని బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయడంతో పాటు రాబోయే 30 ఏళ్లలో పెరగనున్న జనాభా, రవాణా, మౌలిక వసతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పాలనా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ (క్యూర్) బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రవాణా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో వాటితోపాటు ఇతర కీలక సంస్థలు సమన్వయంతో పనిచేసేలా క్యూర్ చట్టం ద్వారా చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
క్యూర్ అత్యున్నత పాలకమండలికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారని మంత్రి తెలిపారు. మహానగర పాలనకు సంబంధించిన చట్టాల్లో అవసరమైన సరళీకరణ చేపడతామని, భవిష్యత్ నగర పాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు తొలిదశకు రూ.7,345.12 కోట్లతో అనుమతులు ఇచ్చినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మురుగునీటిని శుద్ధి చేసి చెట్ల పెంపకం, కాలుష్య నియంత్రణ వంటి అవసరాలకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విధానంతో రాష్ట్రాన్ని దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ ఎదగాలని, భారీ పెట్టుబడులను ఆకర్షించే గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. నగర చారిత్రక వైభవాన్ని కాపాడుతూనే ఆధునిక మౌలిక వసతులతో భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ చట్టం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. సాంకేతిక స్వభావం కలిగిన సుమారు 400 రకాల చిన్నపాటి ఉల్లంఘనలను నేరపూరిత పరిధి నుంచి తొలగించే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని చెప్పారు. చిన్న వ్యాపారులు అనవసరంగా కేసులు, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని తగ్గించడమే ఈ మార్పుల ఉద్దేశమని మంత్రి వివరించారు. కొత్త నిబంధనలపై కలెక్టర్లు, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.








