- పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సంక్షేమానికి కీలకం
- విద్యతో పాటు క్రీడలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం
- మాదకద్రవ్యాలకు దూరంగా.. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, మహా : పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం పోలీసు సంక్షేమంలో కీలక భాగమని డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన లేకుండా చేస్తే పోలీసులు విధులపై మరింత దృష్టి సారించగలరని పేర్కొన్నారు. మంచిరేవులలోని ఆక్టోపస్–గ్రేహౌండ్స్ ప్రాంగణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) అకడమిక్ బ్లాక్–1 నిర్మాణానికి భూమిపూజ చేశారు. 2024 డిసెంబరులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డీజీపీ తెలిపారు. ఆర్మీ, సైనిక్ స్కూళ్ల తరహాలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో వైఐపీఎస్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఏప్రిల్‌లో తాత్కాలిక ప్రాంగణంలో 120 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభమైందని, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య సుమారు 360కు చేరిందన్నారు. కొత్త భవనం పూర్తయితే వచ్చే ఏడాది 700–720 మందికి చేరే అవకాశం ఉందని తెలిపారు.
విద్యతోపాటు క్రీడలు.. క్రమశిక్షణ
విద్యార్థుల్లో విద్య, క్రమశిక్షణతోపాటు క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా బాధ్యతాయుత పౌరులుగా ఎదిగేలా దోహదపడాలని ఆకాంక్షించారు. క్రికెట్‌తో పాటు రాక్ క్లైంబింగ్, గుర్రపు స్వారీ వంటి సాహస క్రీడల్లోనూ శిక్షణ అందిస్తామని తెలిపారు. పోలీసు సిబ్బందితోపాటు ఇతర వర్గాల పిల్లలకు కూడా అందుబాటులో ఉండేలా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందించనున్నట్లు డీజీపీ తెలిపారు. హోంగార్డుల పిల్లలకు కూడా ప్రవేశాల్లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. పాఠశాలలో 50 శాతం సీట్లు సాధారణ విద్యార్థులకు కూడా కేటాయించనున్నట్లు వెల్లడించారు.
ఒకే ప్రాంగణంలో ప్లస్–2 వరకు విద్య
పాఠశాల అభివృద్ధికి అకడమిక్ తదితర అంశాలపై పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఒకే ప్రాంగణంలో ప్లస్–2 వరకు విద్య అందించే పూర్తిస్థాయి పాఠశాలగా వైఐపీఎస్‌ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రానున్న రెండు, మూడేళ్లలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాసంస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. నిర్మాణ, అభివృద్ధి పనులను సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం సమర్థవంతమైన పోలీసింగ్‌తో ముడిపడి ఉన్నాయని డీజీపీ అన్నారు. తమ పిల్లల చదువుపై భరోసా కల్పిస్తే పోలీసులు విధులపై మరింత ఏకాగ్రతతో పనిచేయగలరని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, డీజీ (ఆక్టోపస్) అనిల్‌కుమార్, సైబరాబాద్ సీపీ రమేష్, ఐజీ (పి&ఎల్) గజరావు భూపాల్, ఏఐజీ రమణకుమార్, లీగల్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్‌కుమార్, డీసీపీ శ్రీనివాస్, అదనపు ఎస్పీ ఉదయ్‌రెడ్డి, ఏసీపీలు, వివిధ సంస్థల ప్రతినిధులు, వైఐపీఎస్ ప్రిన్సిపాల్ డా. అనితారెడ్డి, జీఎం రాజేష్, పోలీసు అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.








