ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు.
* సహచరుడిని కాపాడిన స్థానికులు.
* ముక్త్యాల బ్రాంచ్ కాలువలో విషాద ఘటన.
* గాలింపు చర్యలు ముమ్మరం.
సూర్యాపేట, మహా:
ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు కాలువలో గల్లంతైన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ముక్త్యాల బ్రాంచ్ కాలువలో ఈ ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు శనివారం సెలవు కావడంతో కాలువలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు.
ముకుందాపురం గ్రామానికి చెందిన హరీశ్‌నాయుడు, స్వరూప్, అనుదీప్ కలిసి కాలువలో ఈతకు వెళ్లినట్లు సమాచారం. ఈత కొడుతున్న సమయంలో హరీశ్‌నాయుడు, స్వరూప్ నీటిలో గల్లంతయ్యారు. అనుదీప్ కూడా నీటిలో చిక్కుకున్నప్పటికీ.. అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తమై అతడిని రక్షించారు.
ఇద్దరు విద్యార్థులు కనిపించకపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాలువలో నీటి మట్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టి గల్లంతైన విద్యార్థులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో విషాద వాతావరణం నెలకొంది.
సెలవు రోజున సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదానికి గురికావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.








