- ముఖ్యమంత్రి సోదరుడు కొండల్‌రెడ్డికి టెస్సెరాక్ట్ కంపెనీకి అక్రమంగా కేటాయించిన భూమి వద్ద బీఆర్ఎస్ నిరసన
- కొండల్‌రెడ్డి టెస్సెరాక్ట్ భూమి వద్ద తుక్కుగూడలో బీఆర్ఎస్ సమరం
- కేటీఆర్ నేతృత్వంలో కొండల్‌రెడ్డి భూమి వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- రూ.250 కోట్ల విలువైన భూమి రూ.7 కోట్లకేనా?
- అన్నదమ్ములకు వందల కోట్ల భూములా? ప్రజలకు సంక్షేమం చేయడానికి పైసల్లేవా?
- ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ మాయాజాలం
కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి టెస్సెరాక్ట్ కంపెనీ కోసం ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన భూమి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు తుక్కుగూడకు చేరుకుని భూమిని పరిశీలించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించారని ఆరోపించిన కేటీఆర్.. ప్రభుత్వ భూమిని మార్కెట్ విలువకు కాకుండా ఇంత తక్కువ ధరకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఈ భూకేటాయింపుపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వడం అధికార దుర్వినియోగం కాదా? ప్రయోజనాల సంఘర్షణ కాదా? కుటుంబ పాలన కాదా? అని నిలదీశారు.
మరోవైపు అనుముల జగదీశ్వర్‌రెడ్డికి సంబంధించిన సంస్థకు రూ.1,000 కోట్ల పెట్టుబడి పేరుతో ప్రభుత్వ రాయితీలు, భూములు, మినహాయింపులు కల్పించే వ్యవహారంపైనా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. “ఒకవైపు గ్రేట్ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి.. మరోవైపు గ్రేట్ పారిశ్రామికవేత్త అనుముల జగదీశ్వర్‌రెడ్డి. ఇద్దరి మధ్య రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. దానికి మళ్లీ ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ భూములు, మినహాయింపులు ఇవ్వాలా?” అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి సోదరుడి సంస్థ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో చేసుకున్న ఒప్పందంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ.250 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే కేటాయించిన వ్యవహారంపై బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. “ఈడీ, ఐటీ, సీబీఐలు మా మీద కేసులు పెట్టడానికే ఉన్నాయా? అధికారంలో ఉన్నవారి వ్యవహారాలు ఎందుకు కనిపించడం లేదు?” అని నిలదీశారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆరోపిస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. “తెలంగాణ ఏటీఎంగా మారిందని ప్రధాని చెబుతున్నారు. మరి తెలంగాణను కొల్లగొడుతున్నారని మీరు ఆరోపిస్తున్నప్పుడు దొంగలను పట్టుకోవాల్సిన హోంమంత్రి ఎక్కడున్నారు? ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు లోబడి ఉంటాయని కేటీఆర్ అన్నారు. ఈ రంగంలోనూ అధికారానికి దగ్గరగా ఉన్న కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు కూడా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోకి రావడంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు.
శాసనసభలో ఈ భూకేటాయింపులు, ఫ్యూచర్ సిటీ, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తామనే తమను సస్పెండ్ చేసి బయటకు పంపారని కేటీఆర్ అన్నారు. “శాసనసభలో మా గొంతు నొక్కారు. మీ దోపిడీని సభలో బయటపెడతామనే భయంతో మమ్మల్ని మెడపట్టి బయటకు పంపారు. అందుకే మీ తమ్ముడికి ఇచ్చిన భూమి వద్దకే వచ్చాం. ఇక్కడి నుంచే ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం” అని స్పష్టం చేశారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాయాజాలం నడుపుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఫార్మాసిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూసేకరణ జరిగిందని, ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగించడం చట్టపరంగా ప్రశ్నార్థకమని అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు ఈ న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
“ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. రేపు కోర్టులో ఈ భూములపై వివాదాలు తలెత్తితే నష్టపోయేది పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలే. రేవంత్‌రెడ్డి కుటుంబ ప్రయోజనాల కోసం జరుగుతున్న రియల్ ఎస్టేట్ మాయాజాలంలో పెట్టుబడిదారులు బలిపశువులు కావద్దు” అని కేటీఆర్ హెచ్చరించారు.
ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే సామాన్యులు, యువత, రైతులకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములు, రాయితీలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. “మేము లక్ష రూపాయల మూలధనంతో పెట్టుబడి పెడతామని వస్తే రూ.200 కోట్ల విలువైన స్థలం ఇస్తారా? మాకూ అదే రాయితీలు, మినహాయింపులు ఇస్తారా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రజా కోర్టును ఆశ్రయిస్తామని, రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి భూకేటాయింపులు, ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అవసరమైన అన్ని న్యాయ, ప్రజాస్వామ్య మార్గాలను అన్వేషించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
మీడియా కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం చూపిస్తున్న రంగుల కల వెనుక ఉన్న న్యాయపరమైన అంశాలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ కోరారు. పెట్టుబడిదారులు భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉన్న అంశాలను కూడా వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
“ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించుకుని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, పెట్టుబడి ప్రయోజనాలు కల్పించడం అధికార దుర్వినియోగం కాదా? కుటుంబ పాలన కాదా? ప్రయోజనాల సంఘర్షణ కాదా?” అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రజల సొమ్ము, ప్రభుత్వ భూముల విషయంలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాల్సిందేనని.. ఈ భూవ్యవహారంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.








