‘నిజం గెలిచింది’.
* 53 రోజుల జైలు జీవితం గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు.
* ‘నన్ను జైల్లో పెట్టగలిగారు.. కానీ నా స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు.
* ప్రజల కోసం నిలబడితే ప్రజలు మన వెంట ఉంటారు.
* నిజం కోసం నిలబడితే నిజమే మనల్ని నిలబెడుతుంది
అమరావతి, మహా:
‘ప్రజల కోసం నిలబడితే.. ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే.. నిజమే మనల్ని నిలబెడుతుంది’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తనను అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచిన ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం ‘నిజం గెలిచింది’ హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్ వేదికగా ఆయన భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
మూడేళ్ల క్రితం కుట్రపూరితంగా తనను అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. “నన్ను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. వారి రాక్షస చర్యకు కుంగిపోలేదు.. లొంగిపోలేదు” అని ఆయన పేర్కొన్నారు.
ఆ క్లిష్ట సమయంలో తెలుగు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తనకు అండగా నిలిచారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. దేశ, విదేశాల్లో తనకు మద్దతుగా ప్రజలు గొంతెత్తారని, ప్రజాస్వామ్యం, న్యాయం, సత్యం కోసం పోరాడారని తెలిపారు. ఆ సమయంలో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ తన జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకమని అన్నారు.
తనను నిర్బంధించగలిగినా దేశ, విదేశాల్లో తనకు మద్దతుగా ప్రజలు లేవనెత్తిన గొంతును మాత్రం అణచలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల మద్దతే తనకు మరింత ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు.
2024 ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా తనకు మరింత బలమైన మద్దతు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి, నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తమకు అప్పగించారని పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేయాలనే సంకల్పాన్ని బలోపేతం చేశాయని చంద్రబాబు తెలిపారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతిని నెంబర్-1గా నిలపాలన్న తన కలను ప్రజల సహకారంతో సాకారం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో మరోసారి భావోద్వేగాన్ని రేకెత్తించాయి. ఇదే సమయంలో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.








