Mahaa Daily Exclusive

  రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి…

Share

  • రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి…ఎన్నికల అధికారి, అబ్జర్వర్ నియామకం
  • జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్య శారద

వరంగల్,కలెక్టరేట్ మహా ;

వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సత్య శారద తెలిపారు.
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల నిర్వహణపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అబ్జర్వర్‌గా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేశ్‌ను, ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి (డీసీఓ) నీరజను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. సభ్యులు, సంబంధిత ప్రజల పరిశీలనార్థం ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయం, వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఉంచినట్లు వారు పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు, చేర్పులు, సవరణలకు సంబంధించి నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించి అధికారులకు సహకరించాలని కోరారు.

ఎన్నికల షెడ్యూల్ ఇలా

సెప్టెంబర్ 9 నుండి 14 వరకు ఓటర్ల జాబితా ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది. సెప్టెంబర్ 15న ఓటర్ల జాబితాలో చేర్పులు, సవరణల కోసం అభ్యర్థనలు స్వీకరిస్తారు.

సెప్టెంబర్ 16న ఓటర్ల జాబితా పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర శాఖకు అప్పీళ్లను సమర్పిస్తారు. సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో పాటు ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్‌ను విడుదల చేస్తారు.

సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

ప్రతి నామినేషన్‌ను ఇద్దరు అర్హత కలిగిన సభ్యులు ప్రతిపాదించి, సమర్థించాల్సి ఉంటుంది.

ప్రతి నామినేషన్‌కు తిరిగి చెల్లించబడని రూ.10,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 25న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు.

సెప్టెంబర్ 26న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
అవసరమైతే అక్టోబర్ 4, 2026న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.
అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి, లెక్కింపు పూర్తయిన అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేశ్, జెడ్పీ సీఈఓ ఎన్. వసంత, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, డీసీఓ నీరజ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ భార్గవ్, ఉపాధి కల్పన అధికారి సాత్విక తదితరులు పాల్గొన్నారు.