- కేంద్రం అనుమతి నిరాకరణపై రేవంత్ విస్మయం.
- తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటనకు బ్రేక్.
- యూకే పర్యటన కొనసాగింపు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. యూకే, అమెరికా దేశాల్లో పర్యటించి తెలంగాణకు పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను తీసుకురావాలన్న లక్ష్యంతో రూపొందించిన పర్యటనలో అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడంతో లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రావాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం తొలుత యూకే, అనంతరం అమెరికాలో పర్యటించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. విధివిధానాలు, అధికారిక ప్రోటోకాల్ ప్రకారం కేంద్రం నుంచి అనుమతి కోరారు. తొలుత యూకే పర్యటనకు అనుమతి లభించింది. ప్రతినిధి బృందం యూకేకు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.
‘రాజకీయ కారణాలతో నిరాకరించడం విస్మయం’
అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగ పురోగతి, యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాల కల్పనతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడే లక్ష్యంతో ఈ పర్యటనను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో పర్యటనకు అనుమతి నిరాకరించడం విచారకరమని అన్నారు.
అయితే కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తామని, యూకే పర్యటనను కొనసాగించి అక్కడి కార్యక్రమాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమెరికాలోని బోస్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను మాత్రం రద్దు చేశారు.
‘ప్రపంచ స్థాయి విద్యను హైదరాబాద్‌కు తీసుకురావాలి’
అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశం ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడమేనని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలని భావించామని చెప్పారు.
ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న తెలంగాణ యువత ఆకాంక్షలకు ఈ భాగస్వామ్యాలు సమాధానంగా నిలిచేవని పేర్కొన్నారు.
‘‘దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా అందరూ ఆలోచించాలి’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
అధికారులకు కీలక ఆదేశాలు
అమెరికా పర్యటన రద్దయినప్పటికీ అక్కడి విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే ప్రారంభమైన చర్చలను నిలిపివేయరాదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ విశ్వవిద్యాలయాలతో కొనసాగుతున్న సంప్రదింపులను అధికారులు ముందుకు తీసుకెళ్లాలని, అవసరమైన అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణలో విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
‘హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా మారుస్తాం’
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జ్ఞాన, నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ వంటి విద్యాసంస్థలు నగరాన్ని అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రపంచస్థాయి సాంకేతిక నాయకులు ఎదిగారని, ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థలతో నగరం అంతర్జాతీయ సంస్థలను, ప్రపంచస్థాయి సామర్థ్య కేంద్రాలను ఆకర్షించగలిగిందని పేర్కొన్నారు.
ఇకపై ప్రపంచంలోని ప్రముఖ విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చి 21వ శతాబ్దపు తెలంగాణ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఆక్స్‌ఫర్డ్ నుంచి లండన్ వరకు..
అమెరికా పర్యటన రద్దయినా యూకే పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యాలపై చర్చించనున్నారు.
అలాగే యూకేలోని ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగ ప్రతినిధులతోనూ సమావేశమై తెలంగాణతో భాగస్వామ్యాలను ఖరారు చేసేందుకు ప్రయత్నించనున్నారు.
‘విదేశీ విద్య కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా..’
ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాధారణ భారతీయ విద్యార్థి హైదరాబాద్‌లోనే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, ఎంఐటీ, లండన్ బిజినెస్ స్కూల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచస్థాయి సంస్థలతో అనుసంధానమై విద్య, శిక్షణ, ధ్రువపత్రాలు పొందే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు.
‘‘చాలామంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకున్నారు. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్‌కు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
అమెరికా పర్యటనకు కేంద్ర అనుమతి నిరాకరణతో రాజకీయంగా వివాదం చెలరేగినప్పటికీ.. యూకే పర్యటన ద్వారా విద్య, నైపుణ్యాలు, క్రీడలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై తెలంగాణ ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగించనుంది.








