- సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయం
- మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ కు ఎమ్మెల్యేల డిమాండ్
- పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుకు ఎమ్మెల్యేలు సిద్ధమా?
వరంగల్, బ్యూరో మహా;
కొండా సురేఖ వివాదం మరోసారి చిలికిచిలికి గాలివానలా మారింది. మొత్తం వ్యవహారం పై ఇవాళ సీఎల్పీ వేదికగా ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను టార్గెట్ గా చేసుకుని కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల పై అధిష్ఠానం ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉండగా, పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమెకు వ్యతిరేకంగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు.
ఎమ్మెల్యేల ఆగ్రహం..
అయితే.. తన కుమార్తె సుస్మిత చేసిన సంచలన వ్యాఖ్యలను తల్లిగా, మంత్రిగా సురేఖ ఇప్పటి వరకు ఖండించక పోవడాన్ని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపట్టారు. బాధ్యతాయుత మైన మంత్రి పదవిలో ఉంటూ, కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ చెప్పడం పై వారు మండిపడ్డారు. సంబంధం లేకపోతే ఆ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని, ఆమె ఇచ్చిన వివరణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి నివేదించేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. మంత్రి కొండా సురేఖ అంశం పై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.!








