- టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు బీఆర్‌ఎస్ పిలుపు.
- కోకాపేట్, సనత్‌నగర్‌లో భారీగా పోలీసుల మోహరింపు.
హైదరాబాద్, మహా.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను పోలీసులు బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు. సనత్‌నగర్‌లో ఇటీవల ప్రారంభమైన టిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. హరీశ్‌రావు కోకాపేట్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి.. ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఆస్పత్రిని సందర్శించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలు టిమ్స్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హరీశ్‌రావు నివాసం వద్ద ఉదయం నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే టిమ్స్‌కు వెళ్తాం: తలసాని
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకే ఆస్పత్రిని సందర్శించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెట్టకుండా అడ్డుకునేందుకే తమను హౌస్ అరెస్ట్‌లు, నిర్బంధాలకు గురిచేస్తున్నారని తలసాని విమర్శించారు. సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులను కూడా పోలీసులు ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన
హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్ కావడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా నేతలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు బీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.








