Mahaa Daily Exclusive

  మెగా డీఎస్సీపై వైసీపీ ఆందోళన..! సభను కాసేపు వాయిదా వేసిన చైర్మన్‌..

Share

  •  ఏపీ శాసన మండలిలో గందరగోళం.
  •  వాయిదా తీర్మానం తిరస్కరణతో పోడియం వద్ద నిరసన.
  •  సభను కాసేపు వాయిదా వేసిన చైర్మన్‌

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన వెంటనే శాసన మండలిలో మెగా డీఎస్సీ అంశం వేడెక్కింది. మెగా డీఎస్సీపై చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా.. శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేను రాజు దాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు తీవ్ర నిరసనకు దిగారు.

వైసీపీ సభ్యులు చైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేస్తూ మెగా డీఎస్సీపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మెడలో నల్ల కండువాలతో సభకు వచ్చిన వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. సభ్యుల ఆందోళనతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చైర్మన్‌ సభను కాసేపు వాయిదా వేశారు.

సభను గౌరవించడం లేదు: నాదెండ్ల మనోహర్‌

వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా మర్యాదలను సభ్యులు కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. చైర్మన్‌ సభను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేయడం, చైర్మన్‌ టేబుల్‌ను కొట్టడం సరికాదని పేర్కొన్నారు.

సభా నిబంధనలను పాటిస్తూ ప్రజా సమస్యలను ప్రస్తావించాలని ఆయన సూచించారు. మంత్రి వ్యాఖ్యలపై చైర్మన్‌ కొయ్యే మోషేను రాజు అసహనం వ్యక్తం చేశారు. సభ నిర్వహణ, నిబంధనల గురించి మంత్రికి కూడా అవగాహన ఉందని, సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తనకు తెలుసని స్పష్టం చేశారు.

సభా సంప్రదాయాలను పాటించాలి: అచ్చెన్నాయుడు

వైసీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ సభా సంప్రదాయాలు, నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు సాగాలని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ చైర్మన్‌గా మోషేను రాజు వ్యవహరించారని గుర్తుచేశారు. అప్పట్లో విపక్ష సభ్యులు నిర్దేశించిన పరిమితిని దాటితే చర్యలు తీసుకున్న సందర్భాలను ప్రస్తావించారు.

మూడు రోజులుగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చైర్మన్‌కు సభలో తగిన అధికారాలు ఉన్నాయని, వాటిని నిబంధనల ప్రకారం వినియోగించాలని సూచించారు. చైర్మన్‌ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, అయితే సభ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

డీఎస్సీపై చర్చకు వైసీపీ పట్టుబాటు

మెగా డీఎస్సీ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సభలో చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. మరోవైపు సభా నిబంధనలకు అనుగుణంగానే చర్చలు, తీర్మానాలు చేపట్టాలని అధికారపక్షం స్పష్టం చేస్తోంది. దీంతో మూడో రోజు సమావేశాల్లోనూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

మెగా డీఎస్సీపై వైసీపీ ఆందోళనతో ప్రారంభమైన ఈ పరిణామాలు శాసన మండలిలో రాజకీయ వేడిని మరింత పెంచాయి. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Latest