Mahaa Daily Exclusive

  టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తా..! రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్‌ సవాల్‌..!

Share

  •  రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్‌ సవాల్‌.
  •  పరకాల రాజకీయాల్లో వేడెక్కిన వాతావరణం.

వరంగల్‌, మహా.
పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తనకు టికెట్‌ ఇవ్వకపోతే పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్‌ ప్రకటించారు. పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని సుష్మితా పటేల్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో తన తండ్రి కొండా మురళీ కూడా సహకరించారని ఆమె పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయంలోనూ కొండా మురళీ అండగా నిలిచారని తెలిపారు.

కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, అయితే ఆ హామీ అమలు కాలేదని సుష్మితా పటేల్‌ ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని తాను హామీ ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి చెప్పగలిగితే.. పరకాలలోని మైసమ్మపై ప్రమాణం చేసి చెప్పాలని ఆమె సవాల్‌ విసిరారు.

‘దమ్ముంటే ఇప్పుడే ఎన్నికలకు రండి’

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ విషయంలోనూ సుష్మితా పటేల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పరకాల టికెట్‌ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే పదవికి రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. తమ రాజకీయ ఇలాఖాకు వచ్చి తమతో ఎందుకు పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తనకు అవకాశం ఇవ్వకపోతే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, స్వతంత్ర అభ్యర్థిగా పరకాల నుంచి పోటీ చేస్తానని సుష్మితా పటేల్‌ స్పష్టం చేశారు. దీంతో పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చినట్లైంది.

‘అచ్చ కాంగ్రెస్‌.. పచ్చ కాంగ్రెస్‌ మధ్య పోటీ’

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో అచ్చ కాంగ్రెస్‌, పచ్చ కాంగ్రెస్‌ మధ్య పోటీ కొనసాగుతోందని సుష్మితా పటేల్‌ వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న భావన వ్యక్తం చేశారు. పరకాల నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. తమను పక్కన పెట్టే ప్రయత్నాలను సహించబోమనే సంకేతాలు ఇచ్చారు.

‘మరిన్ని విషయాలు బయటపెడతా’

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడికి సంబంధించిన అవినీతి వ్యవహారాలపై తాను ఇప్పటివరకు రూ.200 కోట్లకు సంబంధించిన అంశాలను మాత్రమే బయటపెట్టానని సుష్మితా పటేల్‌ ఆరోపించారు. తన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తే మరిన్ని విషయాలను ప్రజల ముందుకు తీసుకువస్తానని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

వచ్చే ఎన్నికల నాటికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటారో, లేదో కూడా చెప్పలేమని సుష్మితా పటేల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖ కుటుంబానికి చెందిన నాయకురాలు బహిరంగంగా స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించడం పరకాల కాంగ్రెస్‌ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.