Mahaa Daily Exclusive

  అర్హులైన ప్రతి నేతన్నకూ అండగా ఉంటాం..! ‘నేతన్నల సేవలో’ కింద రూ.25 వేల సాయం.. :చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత.

Share

• ‘నేతన్నల సేవలో’ కింద రూ.25 వేల సాయం.
• ఈ నెల 20లోగా కొత్త దరఖాస్తుదారులకు చెల్లింపులు.
•చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

అమరావతి, మహా.

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘నేతన్నల సేవలో’ పథకం కింద అర్హత ఉన్న ప్రతి నేతన్నకూ రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇప్పటికే మెజారిటీ అర్హులైన నేతన్నల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసినట్లు తెలిపారు. వివిధ కారణాలతో ఇప్పటివరకు సాయం అందని మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు మరో ఒకట్రెండు రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు.

నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తులను అధికారులు వేగంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన వెంటనే అర్హత నిర్ధారణ అయిన కొత్త దరఖాస్తుదారులకు ఈ నెల 20వ తేదీలోగా రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.

అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆర్థిక సాయం అందలేదని ఏ చేనేత కుటుంబం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

పేద చేనేత కుటుంబాలకు అండగా నిలవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. నేతన్నల ఇళ్లలో ఆర్థిక భరోసాతోపాటు ఆనందం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ‘నేతన్నల సేవలో’ పథకాన్ని వేగంగా అమలు చేస్తున్నామని చెప్పారు. చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడూ పథకం నుంచి మిగిలిపోకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు.

Latest