Mahaa Daily Exclusive

  రేషన్‌ కార్డులపై మోదీ ఫొటో పెట్టాల్సిందే..!

Share

• కేంద్రం ఇచ్చే బియ్యానికి రాష్ట్రం గుర్తింపు ఇవ్వడం లేదు.
• కార్డుల ముద్రణ ఖర్చులు, టెండర్ల వివరాలు వెల్లడించాలి: రఘునందన్‌రావు

హైదరాబాద్‌, మహా .
తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద అందిస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో తప్పనిసరిగా ముద్రించాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల బియ్యం ఇస్తుండగా.. అందులో ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నవేనని రఘునందన్‌రావు పేర్కొన్నారు. కేంద్రం అందిస్తున్న బియ్యాన్ని పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఒక్క కిలో బియ్యానికి ముగ్గురు కాంగ్రెస్‌ నేతల ఫొటోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలతో రేషన్‌ కార్డులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్‌ కార్డుల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. ఇప్పటికే తెలంగాణలో సుమారు 90 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా ఎన్ని కార్డులు జారీ చేస్తున్నారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. కొత్త కార్డుల సంఖ్య, అర్హతల నిర్ధారణ, పంపిణీ విధానంపై ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలని అన్నారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ముద్రణకు ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. కార్డుల ముద్రణ కోసం టెండర్లు ఎప్పుడు పిలిచారు, కాంట్రాక్టు ఎవరికి అప్పగించారు, మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని, ప్రజాధనంతో చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన వ్యయ వివరాలు బహిరంగం చేయాలని అన్నారు.

రేషన్‌ డీలర్ల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని ఎంపీ కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రేషన్‌ డీలర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వారికి గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెంచిన రేషన్‌ డీలర్ల కమిషన్‌ను వెంటనే చెల్లించడంతోపాటు బియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. రేషన్‌ వ్యవస్థను బలోపేతం చేయకుండా కేవలం కొత్త కార్డుల పంపిణీతోనే సరిపెట్టుకోవద్దని అన్నారు.

రేషన్‌ కార్డుల ద్వారా పేదలకు బియ్యంతోపాటు మరిన్ని నిత్యావసర సరుకులు అందించాలని రఘునందన్‌రావు సూచించారు. కర్ణాటకలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి కందిపప్పు, వంటనూనె, రాగులు, చక్కెర, గోధుమలు వంటి సరుకులను కూడా పేదలకు అందించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. బియ్యం అవసరం లేని కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆహార ధాన్యాలు అందించే విధానం తీసుకురావాలని సూచించారు.

పేదల ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఎంపీ అన్నారు. రేషన్‌ కార్డులు కేవలం గుర్తింపు పత్రాలుగా కాకుండా పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే సాధనాలుగా ఉండాలని పేర్కొన్నారు. కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం పునఃపరిశీలించాలని, కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో కొత్తగా ముద్రించి పంపిణీ చేయాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.