Mahaa Daily Exclusive

  ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించం….

Share

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించం.
* రహదారులను అడ్డుకునే ఆందోళనలకు అనుమతి లేదు.
* చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.
* ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.

అమరావతి, మహా.

ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా, చట్ట నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ఆందోళనలను ప్రభుత్వం సహించబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ.. ఆ పేరుతో రహదారులు, బస్టాండ్లను అడ్డుకోవడం, సాధారణ ప్రజాజీవనానికి ఆటంకం కలిగించడం అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన వైసీపీ చేపడుతున్న రిలే దీక్షలు, నిరసనలపై పరోక్షంగా స్పందించారు.
డీఎస్సీ అభ్యర్థుల పేరుతో వైసీపీ రాజకీయ నిరసనలు చేపడుతోందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్‌ తప్ప ఒక్క డీఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు. కర్నూలులో ఇటీవల నిరసన చేపట్టిన వారిలో డీఎస్సీకి ఎంపికైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన వారేనని పేర్కొన్నారు.
గత పాలకుల హయాంలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగానే ఉపాధ్యాయులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా స్పందిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఉపాధ్యాయులు ఏకతాటిపైకి వచ్చారని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవిస్తుందని, అయితే చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఆందోళనలను మాత్రం అనుమతించబోమని చంద్రబాబు తేల్చిచెప్పారు. ముఖ్యంగా రహదారులు, బస్టాండ్లను అడ్డుకుని నిర్వహించే నిరసనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదన్నారు. చట్టవిరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.