ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.
• 22 మంది అధికారులకు కొత్త బాధ్యతలు.
• టీటీడీ, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, పుష్కరాల శాఖల్లో కీలక మార్పులు.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రంలో 22 మంది ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులకు బదిలీలు, కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకం, పాఠశాల విద్య, రవాణా, రోడ్లు–భవనాలు, ఆరోగ్యం, హౌసింగ్, విపత్తు నిర్వహణ, గోదావరి పుష్కరాలు, టీటీడీ, మున్సిపల్ పరిపాలన వంటి కీలక విభాగాల్లో అధికారుల మార్పులు చోటుచేసుకున్నాయి. పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎస్. రావత్‌ను నియమించారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జె. శ్యామలరావును బదిలీ చేశారు. రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శిగా కోనా శశిధర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏపీఎస్‌ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. శివప్రసాద్ (ఐఎఫ్‌ఎస్)ను నియమించారు.
ఆమ్రపాలికి పోస్టింగ్ లేదు
ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమ్రపాలి కాటాను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖకు (జీఏడీ) రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆమె స్థానంలో పట్టంశెట్టి రవి సుభాష్‌ను ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. అదనంగా ఏపీపీఎస్సీ సీఈఓ, కార్యదర్శి పోస్టులకు ఫుల్ అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు.
పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక అధికారులు
రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా సురేష్‌కుమార్‌ను, జాయింట్ స్పెషల్ ఆఫీసర్‌గా నారాయణ భరత్‌గుప్తాను నియమించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సమన్వయం, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా కేవీఎన్ చక్రధరబాబుకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఎండీ బాధ్యతలను కూడా ఆయన అదనంగా నిర్వర్తించనున్నారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హెప్సిబా రాణి కొర్లపాటిని నియమించడంతో పాటు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ఎఫ్‌ఏసీగా అప్పగించారు.
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా పి. అరుణ్‌బాబును నియమించారు. పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌గా ముత్యాలరాజు రేవుకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ ఎండీగా గీతాంజలి శర్మకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగంలో టీ.ఎస్. డైరెక్టర్‌గా చేతన్‌కు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు.
తిరుపతిలోనూ కీలక మార్పులు
తిరుపతి పరిపాలనలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఎం. జయకృష్ణను నియమించింది. టీటీడీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ. శరత్ కొనసాగనున్నారు. అదే విభాగానికి ప్రభల గోపీనాథ్‌ను కూడా జాయింట్ ఈవోగా నియమించారు.
ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎ.ఎ.ఎల్. పద్మావతికి ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్ బాధ్యతల నుంచి ఎన్. తేజ్‌భరత్‌ను రిలీవ్ చేసి, ఆ స్థానంలో ప్రఖర్ జైన్‌ను నియమించారు.
ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి బి. అనిల్‌కుమార్‌రెడ్డిని రిలీవ్ చేశారు. ఆయన స్థానంలో బి. సునీల్‌కుమార్‌రెడ్డి (ఐఎఫ్‌ఎస్)కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు.
ఒకేసారి 22 మంది అధికారులకు బదిలీలు, కొత్త బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ శాఖల పనితీరును మరింత వేగవంతం చేయడం, కీలక ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే పుష్కరాల వంటి భారీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.








