Mahaa Daily Exclusive

  మీ సమస్యలు నాకు వదిలేయండి…

Share

  • మీ సమస్యలు నాకు వదిలేయండి
  • విద్యార్థుల భవిష్యత్ కోసం కృషి చేయండి
  • 55 రోజుల్లో 11 వేల మంది టీచర్లను నియమించాం
  • ఏడాదికి రెండు సార్లు ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అవుతా
  • ఉపాధ్యాయ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
  • విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు వైదొలగాలని నిలదీత

హైదరాబాద్, మహా : విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్న ప్రతిసారీ కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అయితే వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత పూర్తిగా తనదేనని స్పష్టం చేశారు. ఇకపై ఉపాధ్యాయ సంఘాలు తమ వ్యక్తిగత సమస్యల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపు నిచ్చారు. ఫిన్‌లాండ్‌, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడిన సీఎం ఉపాధ్యాయ సంఘాల నాయకులకు తాను ఒక్కటే చెబుతున్నా ‘‘మీ సమస్యలు నాకు వదిలేయండి. మీరు అడగకముందే వాటిని పరిష్కరిస్తాను. ప్రమోషన్లు, బదిలీలు కూడా మీ ఇంటి వద్దకే పంపించాం. ఇకపై మీకోసం కాదు.. విద్యార్థుల సమస్యల కోసం నాతో కొట్లాడండి’’ అని సూచించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని వ్యాఖ్యానించిన రేవంత్‌ రెడ్డి, ఆ లోపు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పూర్తి బాధ్యత వహిస్తానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 55 రోజుల్లో 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని గుర్తు చేశారు. ఇలాంటి నియామకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులదేనని, అందుకే వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ విద్యాశాఖను ప్రపంచ దేశాలు ఆదర్శంగా చూసే స్థాయికి తీసుకెళ్లాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. పంచవర్ష ప్రణాళిక తరహాలో ఉపాధ్యాయ సంఘాలు ప్రతిజ్ఞ చేసి పని చేయాలని కోరారు. అలాంటి కృషి చేస్తే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. దేశానికి విద్య, వైద్య రంగాల్లో తెలంగాణే నాయకత్వం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నేరుగా చర్చిస్తానని సీఎం హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలు సమయానికి పడేవి కాదని, ఇప్పుడు మాత్రం అడగకుండానే ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు జమ చేస్తున్నామని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా అదే రోజు వేతనాలు చెల్లిస్తున్నామని వెల్లడించారు.

విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే డరాపౌట్స్ తగ్గి ప్రవేశాలు పెరిగాయన్నారు. 2014 నుంచి 2023 వరకు డ్రాపౌట్స్ పెరిగాయని, గడచిన రండేళ్ళుగా డ్రాపౌట్స్ తగ్గడంతో పాటు ప్రవేశాల సంఖ్య పెరిగిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దడంతో పాటు నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొట్ట మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చారని, సమాజంలో విద్య సమూల మార్పులు తీసుకువచ్చేందుకు పునాదిగా పనిచేస్తుందని నెహ్రూ నమ్మారన్నారు. దేశంలో కరువును పారద్రోలేందుకు ఇరిగేషన్ అవసరాన్ని నెహ్రూ గుర్తించారు, అందుకే సాగునీటి ప్రాజెక్టులను ఆయన ఆధునిక దేవాలయాలుగా వర్ణించారన్నారు. నాటి ప్రధాని నెహ్రూ దూరదృష్టితోనే నేడు 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేయగలిగిందన్నారు. హరిత విప్లవం, పంచవర్ష ప్రణాళికలు తెచ్చిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి 2104 వరకు ప్రధానులుగా ఉన్నవాళ్లు చేసిన మొత్తం అప్పు 50 లక్షల కోట్లు కాగా 2014 నుంచి 2026 వరకు ప్రధాని మోడీ చేసిన అప్పు 151 లక్షల కోట్లు అని పేర్కొన్న సీఎం ఇప్పటి వరకు దేశంపై ఉన్న అప్పు 201 లక్షల కోట్లు అని చెప్పారు. కొందరు చిన్న చిన్న సంఘటనలు చూపి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుతున్నారని, నాడు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని భారత్ ను సార్వభౌమత్వ దేశంగా మార్చిన వారి గురించి మాత్రం తక్కువ చేసి మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. .

నాడు పీవీ తీసుకొచ్చిన గురుకులాలే నేటి నవోదయ విద్యాలయాలకు స్ఫూర్తి అని, నాటి నాయకులు తెచ్చిన సంస్కరణలతో విద్య అందింది.. ఆకలి తీరిందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రతీ పేదవాడికి విద్యను అందించడం మాత్రమే సరిపోదు, … వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నారు. నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పనిచేయాలని, ఆ దిశగా తెలంగాణను తీర్చి దిద్దే ప్రతినిధులు మీరే అని సీఎం అన్నారు. వెనకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేదని, విద్య లేకపోవడమే అసలైన వెనకబాటుతనమన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం పేదలకు పంచడమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 8 వేలు ఖర్చు చేస్తోందన్నారు.

విద్యాశాఖ మంత్రిగా నేనెందుకు వైదొలగాలి

విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి వైదొలగాలని కొందరు మాట్లాడుతున్నారంటూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి విద్యాశాఖకు రాజీనామా చేయాలా అని బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నందుకా, టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? విద్యార్థులకు స్కిల్స్ అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా నియమించినందుకా? నేను రాజీనామా చేయాలని కోరిుతున్నారని విరుచుకుపడ్డారు. విద్య నైపుణ్యం కాదు.. విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇంగ్లీష్ ఒక్కటే ముఖ్యమనుకుంటుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? అని అన్నారు.