ట్రంప్ విమానం చివరి నిమిషంలో మార్పు?
* ఇరాన్ ముప్పు హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం.
వాషింగ్టన్, మహా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వెలువడిన కథనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ ప్రేరేపిత శక్తులు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న అమెరికా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటన నుంచి తిరుగు ప్రయాణానికి ముందు చివరి నిమిషంలో విమానాన్ని మార్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాన్ని వైట్ హౌస్ తోసిపుచ్చుతూ, అధ్యక్షుడి ప్రయాణాల్లో ఇటువంటి మార్పులు సాధారణమేనని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ నెలలో నాటో సమావేశాల్లో పాల్గొనేందుకు ట్రంప్ ఖతార్ ప్రభుత్వం బహుమతిగా అందించిన బోయింగ్-747-8 విమానంలో టర్కీకి వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం ఆ విమానాన్ని వినియోగించకుండా, గతంలో ఉపయోగించిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే అమెరికాకు చేరుకున్నట్లు సమాచారం. అమెరికా నిఘా సంస్థల నుంచి అందిన భద్రతా సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.
డొనాల్డ్ ట్రంప్‌ను, ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు కుట్ర పన్నుతున్నాయన్న సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు అందినట్లు ప్రచారం జరిగింది. దీంతో అత్యంత అప్రమత్తమైన భద్రతా వ్యవస్థ ట్రంప్ ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై స్పందించిన ట్రంప్, కొత్తగా అందిన విమానాన్ని అమెరికా సిబ్బందికి పరిశీలించే అవకాశం కల్పించేందుకే తాను మరో విమానంలో తిరిగి వచ్చానని తెలిపారు.
మరోవైపు, వైట్ హౌస్ అధికారులు కూడా ఈ వార్తలను ఖండించారు. అధ్యక్షుడి ప్రయాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో విమానాలు లేదా ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు చేయడం సాధారణ ప్రక్రియేనని, దీనిని అసాధారణ ఘటనగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి మార్పులు అనేకసార్లు జరిగాయని గుర్తుచేశారు.
ఖతార్ రాజకుటుంబం వినియోగించిన బోయింగ్-747-8 విమానాన్ని అక్కడి ప్రభుత్వం అమెరికాకు బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. అనంతరం అధ్యక్షుడి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కమ్యూనికేషన్, రక్షణ వ్యవస్థల ఆధునికీకరణ పనులు చేపట్టారు. అయితే శత్రుదేశాల క్షిపణులను గుర్తించి అడ్డుకునే అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఇంకా పూర్తిస్థాయిలో అమర్చలేదన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అన్ని భద్రతా వ్యవస్థల ఏర్పాటు పూర్తవుతుందని అమెరికా రక్షణ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ట్రంప్ ప్రయాణానికి సంబంధించి వెలువడిన కథనాలపై అధికారిక ధృవీకరణ మాత్రం వెలువడలేదు.







