Mahaa Daily Exclusive

  నేటి నుంచి శాకాంబరీ ఉత్సవాలు… ఇంద్రకీలాద్రిపై సర్వం సిద్ధం…

Share

 

విజయవాడ, మహా.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు జరిగే శాకాంబరీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వీఐపీ దర్శనాలు ఉన్నప్పటికీ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఆదివారం ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీతో కలిసి మీడియాతో మాట్లాడిన ఈవో, శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరిస్తామని తెలిపారు. దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు తాము పండించిన తొలి పంటను సమర్పించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత అని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే దాతల నుంచి సుమారు 12 వేల టన్నుల కూరగాయలు అందినట్లు వెల్లడించారు.

అమ్మవారికి సమర్పించిన కూరగాయలతో ప్రత్యేకంగా కదంబ ప్రసాదాన్ని తయారు చేసి మూడు రోజులపాటు భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఈవో తెలిపారు. శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలలతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు అనుగుణంగా క్యూ లైన్లు, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని జూలై 27, 28, 29 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భారీ రద్దీ కారణంగా జూలై 26 నుంచే ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసి, సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించినట్లు చెప్పారు.

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై ప్రైవేట్ వాహనాల రాకపోకలను నియంత్రించి, దేవస్థానం ప్రత్యేక బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు సహకరించి ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.