- తెలంగాణను దేశానికే ఆదర్శంగా మార్చాం
- రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల అమోఘమైన త్యాగాలను ఆయన ఘనంగా స్మరించుకున్నారు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురై నీళ్లు, నిధులు, నియామకాల కోసం అల్లాడిన తెలంగాణను, తమ పదేళ్ల సుపరిపాలనలో సకల జనుల సంక్షేమం, సమగ్ర ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలిపామని కేసీఆర్ గర్వంగా గుర్తుచేశారు. వ్యవసాయ, ఐటీ, మౌలిక వసతుల రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా మార్చామని పేర్కొన్న ఆయన, ప్రస్తుత పాలకులు అమరవీరుల ఆశయాలను గౌరవిస్తూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాలని హితవు పలికారు.








