Mahaa Daily Exclusive

  రైల్వే ట్రాక్ పై కారును పరుగులు పెట్టించిన యువతి భయభ్రాంతులకు గురైన స్థానికులు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పలు రైళ్ళు..!

Share

శంకర్ పల్లి, మహా : రంగారెడ్డి జిల్లా ట్టి నాగులపల్లి – శంకర్ పల్లి రైల్వే స్టేషన్ ల మధ్య రైలు పట్టాలపై ఓ యువతి హల్‌చల్‌ చేసింది. ఆమె నిర్వాకంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగులపల్లి-శంకర్‌పల్లి మార్గంలో పట్టాలపై సుమారు 7 కి.మీ మేర యువతి కారు నడిపింది. కారును అడ్డగించిన స్థానికులను ఆమె చాకుతో బెదిరించింది. అదే మార్గంలో వస్తున్న ఓ రైలు లోకో పైలట్‌ గమనించి ట్రైన్‌ను ఆపారు. స్థానికులు అతికష్టం మీద యువతిని పట్టుకున్నారు. యువతి చేసిన పనితో సుమారు 2 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

అనంతరం శంకర్‌పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. పట్టాలపై కారు నడిపిన యువతిని లక్నోకు చెందిన రవికా సోనీగా గుర్తించారు. రీల్స్‌ కోసమే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించినట్లు సమాచారం. ఇటీవల రవికా సోనీని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఆమె మతిస్థిమితం కోల్పోయిందా? డ్రగ్స్‌ తీసుకుందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం యువతిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి రైలు పట్టాలపై దాదాపు 80 కి.మీ ల వేగంతో పరుగులు పెట్టించింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ ఆమె లెక్క చేయలేదు. గురువారం తెల్లవారు జామున ఈ ఘటన సంభవించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, స్థానిక పోలీసులు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా మూడు కిలోమీటర్ల పాటు ఆ యువతి కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు. శంకర్ పల్లి వద్ద గల రైల్వే గేటు మీదుగా ఆ యువతి కారులో రైలు పట్టాలపై వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో బెంగళూరు- కాచిగూడ సహా వివిధ రైళ్లను సమీప స్టేషన్లల్లో ఆపివేశారు.

Latest