Mahaa Daily Exclusive

  ఎన్ఆర్ఐ భర్త వేధింపులు.. న్యాయం కోసం శ్రావ్య పోరాటం…!

Share

ఇల్లెందు:మహా.
‘‘బలం బలగం ఉంటే ఆడపిల్లల్ని వేధించొచ్చా?’’ అంటూ కన్నీటి గళంతో తమపై జరిగిన అన్యాయాన్ని వివరించారు ఎన్నారై భార్య దుబ్బాక శ్రావ్య. గురువారం ఇల్లెందులో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.

శ్రావ్య చెప్పిన వివరాల ప్రకారం – 2023 అక్టోబర్ 8న లలితాపురంకు చెందిన పెండ్లి నవీన్ కుమార్ రెడ్డితో వివాహం జరిగింది. రెండు నెలల తర్వాత ఆమెను అమెరికాకు తీసుకెళ్లి, మరో రెండు నెలల్లో తిరిగి ఇండియాకు పంపించాడని తెలిపింది. అక్టోబర్ 2024లో వీసా స్టాంపింగ్ ఉన్నా, రిటర్న్ టికెట్‌తో పాటు వీసాను కూడా తనకు తెలియకుండా క్యాన్సిల్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది.

వైద్య పరీక్షలు, మానసిక వేధింపులు

తనకు చెప్పకుండా వైద్య పరీక్షలు చేయించి, రిపోర్టుల్లో ఎలాంటి లోపాలు లేవని వైద్యురాలు స్పష్టం చేసినప్పటికీ, తన భర్త ఆమెను ఆరోగ్య కారణాలతో తప్పుబట్టే ప్రయత్నం చేశాడని చెప్పింది. తన భర్తతోపాటు అత్తమామలు, తోటి కోడలు కలిసి ఆమెను గత ఎనిమిది నెలలుగా బెదిరిస్తున్నారని, ‘‘నీ భర్త నాలుగేళ్లలో రాడంటే ఏం చేస్తావో చేసుకో.. మాకైతే అధికారుల బలం ఉంది’’ అని దురుసుగా మాటలు చెప్పారని వాపోయింది.

ఫిర్యాదు చేసి వారం.. స్పందన లేదు!

తమకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆయన సూచన మేరకు కేసు ఇల్లెందుకు బదిలీ అయినట్లు పేర్కొంది. జూన్ 19న స్టేషన్‌కు వెళ్లినప్పుడు పోలీసులు కేవలం కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చారని, జూన్ 25న తమను స్టేషన్‌కు రమ్మని చెప్పినా, అక్కడ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. అదే సమయంలో తన భర్త ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే సీఐపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయడం చూసి షాక్ అయ్యామని చెప్పారు.

చెల్లి పెళ్లి కూడా చెడగొట్టే కుట్ర

శ్రావ్య తల్లిదండ్రులు మాట్లాడుతూ – వారి చిన్నకుమార్తెకు పెళ్లి కుదిరిన తర్వాత, శ్రావ్య భర్త తన కుమార్తెకు ఆరోపణలు చేస్తూ సంబంధాలు చెడగొట్టే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. ‘‘మేము సిద్ధంగా ఉన్నాం. ఏ టెస్టైనా చేయించండి. తప్పు ఉన్నట్టు వస్తే తామే వెనక్కి తగ్గుతాం’’ అని తల్లిదండ్రులు అన్నారు. తమకు న్యాయం జరగాలని, అవసరమైతే ఐజీ, డీజీపీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామని స్పష్టం చేశారు.

మౌనం మానవత్వం కాదని..

ఆడపిల్లల పట్ల ఈ విధమైన వైఖరిని చూస్తూ ఉండలేమని, తమకు న్యాయం జరగేదాకా పోరాటం ఆపమని శ్రావ్య కుటుంబం స్పష్టం చేసింది. ‘‘మేము లాలూచీలు కోరడం లేదు.. మనుషులం కదా, మనసు ఉంది కదా.. దయతో ఒకసారి వినండి’’ అంటూ అధికారులను వేడుకుంటున్నారు

Latest