హైదరాబాద్, మహా
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించి పాతిక సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఆస్పత్రి 25వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణతో పాటుగా.. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో.. లేక భారీగా లాభాలు ఆర్జించాలనే ఆశతోనో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించలేదని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తమకు కలిగిన వ్యక్తిగత నష్టం నుంచి పుట్టిన ఆలోచనల్లో నుంచే బసవతారకం క్యాన్సర్ ఆప్పత్రి పుట్టుకొచ్చిందని చెప్పుకొచ్చారు. తమ తల్లి క్యాన్సర్‌తో మరణించడం వల్ల.. అందరికీ క్యాన్సర్ చికిత్స అందించాలని ఉద్దేశంతో.. తమ తండ్రి ఎన్టీఆర్ ఈ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు అని బాలయ్య గుర్తు చేసుకున్నారు. తమకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తోన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, సీఎంలకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య.. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.








