మంచిర్యాల, మహా : ప్రజల భద్రతే మా ధ్యేయమని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎస్.వి. దేవాలయం ఆవరణలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసులు కాలనీలోని అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియాకు కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు, సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను, 4 త్రిచక్ర వాహనాలను (ఆటోలు) సీజ్ చేశామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ నేర నిర్మూలన సాధ్యమని అన్నారు. కాలనీలో అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వారు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వారోత్సవాల్లో భాగంగా, మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఒక మహిళ ఇంటిపై దాడి చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉన్న 8 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
సదరు మహిళపై కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.
కాలనీల స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దీనికి పోలీసుల పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, అదనపు ఎస్సై శ్రీనివాస్, రామకృష్ణాపూర్ అదనపు ఎస్సై లలిత, ఇతర పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








