(మహా- హైదరాబాద్ )
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శనివారం సాయంత్రం ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిరథ మహారథుల ఆధ్వర్యంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కన్నులపండువగా సాగుతోంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, పలువురు సినీ, సాహిత్య, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. విజేతలకు ముఖ్యఅతిథుల చేతుల మీదుగా భారీ మొత్తంలో నగదు బహుమతులు అందజేస్తున్నారు. అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా 2014–2023 జ్యూరీ కమిటీ చైర్మన్ మురళీ మోహన్ డిప్యూటీ సీఎం భట్టి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా చిరు సత్కారం చేశారు. అలాగే జ్యూరీ కమిటీ మెంబర్ దశరధ్, డీవీకే రాజులకు చిరు సత్కారం, గోల్డెన్ మొమెంటో ప్రదానం చేశారు. జ్యూరీ కమిటీ మెంబర్లు ఊహ, డైరెక్టర్ ఉమా మహేశ్వర్ రావు , వనజా ఉదయ్, కూచిపూడి వెంకట్, మధుర శ్రీధర్, జయసుధ, సహా మిగతా వారికి గోల్డ్ మొమెంటో అందచేశారు.ఈ సందర్బంగా గద్దర్ ఫౌండేషన్ కు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేశారు. భారీ సంఖ్యలో సినీ తారలు రావడంతో హైటెక్స్ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. రాజమౌళి, అల్లు అర్జున్‌తో పాటు నందమూరి బాలయ్య, విజయ్ దేవరకొండ, సుకుమార్, నాగ్‌అశ్విన్, పూజాహెగ్డే, జయసుధ, జయప్రధ, సుహాసిని, రీతూ, అనన్య, నాగవంశీ, వివివినాయక్, మహి, ప్రియదర్శి హాజరయ్యారు.
జయజయహే తెలంగాణ
ఈ కార్యక్రమంలో జయజయహే గీతాన్ని కీరవాణి లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. జయసుధ, జయప్రద, సుహాసిని చేతుల మీదుగా దేవర సినిమాకు గాను ఆయుధ పూజ కొరియోగ్రఫీ చేసినందుకు గణేష్ ఆచార్యకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. గాంగ్‌స్టార్ సినిమాకు గాను యాక్షన్ కొరియోగ్రఫీ చేసినందుకు కె. చంద్రశేఖర్ రాధోడ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. మత్తు వదలరా 2 సినిమాకు గాను సత్య, వెన్నెల కిషోర్ ఇద్దరూ బెస్ట్ కమెడియన్స్ అవార్డు అందుకున్నారు. చెరో రెండున్నర లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటోలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాకు గాను శరణ్య ప్రదీప్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్నారు. 3 లక్షల ప్రైజ్ మనీతో పాటు మొమెంటో, ప్రశంసా పత్రం అందుకున్నారు. కమిటీ కుర్రాళ్లు, ఆయ్,35 చిన్న కధ కాదుచ,, సరిపోదా శనివారం తదితర సినిమాలకు అవార్డులు అందజేశారు. కాగా 2024లో కల్కి 2989 ఏడీ ప్రథమ ఉత్తమ చిత్రంగా,పోట్టెల్ ద్వితీయ ఉత్తమ చిత్రం,లక్కీ భాస్కర్ తృతీయ ఉత్తమ చిత్రాలుగా అవార్డులు అందుకున్నాయి. కల్కి 2898 ఏడీ సినిమాకి గాను దర్శకుడు నాగ్ అశ్విన్ బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు.
జై తెలంగాణ అంటూ నినదించిన నటులు
2024లో పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ బెస్ట్ హీరోగా,35 చిన్న కథ కాదు సినిమాకి గాను నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఎన్‌టీఆర్ నేషనల్ అవార్డును నందమూరి బాలకృష్ణకు అందజేశారు. కాగా ఈ సందర్భంగా పలువురు నటులు జై తెలంగాణ అంటూ నినదించడం అందరినీ ఆకట్టుకుంది.
సీఎం రేవంత్ ముందు అల్లుఅర్జున్ డైలాగ్స్
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతోన్న గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెస్ట్ యాక్టర్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అంతేగాకుండా.. ఈ సందర్భంగా పుష్ప-2 సినిమాలోని డైలాగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్‌తో అల్లు అర్జున్ చెప్పారు. ‘ఆ బిడ్డ మీద ఒక్క గీత పడినా.. గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పారు. దీంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది.
గద్దరన్నకు ఇది శాశ్వత గుర్తింపు: బాలయ్య
గద్దరన్న పేరుతో సినీ నటులకు అవార్డులిచ్చి ఆయనకు శాశ్వత గుర్తింపు ఇచ్చారని నటుడు, ఎమ్మెల్యే బాలయ్య అన్నారు. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ ఐటెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలయ్య అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కళలకు చావు లేదు. తెలంగాణ ముద్దు బిడ్డ గద్దరన్న పేరు మీద అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దళిత కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగి ఆయనకంటూ ప్రత్యేక స్థానాన్ని గద్దర్ సంపాదించుకున్నారు. గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. విశ్వాసానికే విశ్వనట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణజన్ముడు నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ అవార్డులను ప్రారంభించారు. రాష్ట్రాలు వేరు అయినా మనమంతా తెలుగువాళ్లమే. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చలన చిత్ర ఉత్సవాన్ని జరుపుతుందన్నందుకు, అందులో నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ తనయుడిగా ఆ అవార్డును తెలంగాణలో మొట్టమొదటి సారి గ్రహీతను అవడం నా పుర్వజన్మసుకృతంగా భావిస్తున్నా. అవార్డుతో పాటు ఇచ్చారని, ఆ డబ్బును బసవతారకం ఆస్పత్రి సేవలకు వినియోగిస్తాం.’’ అని బాలయ్య తెలిపారు.








