వరంగల్ మహా;
భద్రకాళి చెరువు
పూడికతీత పనుల పై బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం చెరువు పరిసర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
పూడికతీత పేరుతో కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిన కాంగ్రెస్ నేతలు జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
పనులలో పారదర్శకత లేదు టెండర్లలో గోల్ మాల్
భద్రకాళి చెరువు నీటిని నవంబరులో వదిలిన తర్వాత టెండర్లను మార్చి వరకు పిలవలేదని ప్రశ్నించిన ఆయన, అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని, అధికారులు కమిషన్ల ప్రాతిపదికన అక్రమంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుడా, ఇరిగేషన్ అధికారుల పై బినామీ వ్యాపారం చేస్తున్నట్టుగా ఆరోపించారు. ఇప్పటి వరకు కేవలం 30 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయని తెలిపిన దాస్యం, పనులు పూర్తయ్యే వరకు బిల్లులు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు, కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య కమిషన్ కుదరని ఒప్పందాలే ఆలస్యానికి కారణమని విమర్శించారు.
ఐ ల్యాండ్ పేరుతో చెరువు విస్తీర్ణం తగ్గింపు
ఎన్ జీ టీ నిబంధనలకు విరుద్ధంగా చెరువులో ఐ ల్యాండ్లు నిర్మించడం దారుణమని విమర్శించారు. సుందరీకరణ పనులు ప్రారంభించ కుండానే చెరువు విస్తీర్ణాన్ని తక్కువ చేస్తూ ఆర్థికపరమైన గోల్ మాల్ కు తెర లేపారని పేర్కొన్నారు. చెరువు మట్టిని అమ్ముకోవడం పై తీవ్రంగా ఖండించిన ఆయన గచ్చిబౌలిలో భూముల చదును కోసం మాత్రము జేసీబీలు దొరికాయ్..కానీ భద్రకాళి చెరువు పూడిక తీత కు లేవా..? అని ఎద్దేవా చేశారు.
జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు
చెరువు పై ఆధారపడి 800 మత్స్యకార కుటుంబాలు, మొత్తం రెండు వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయారని వారికి వెంటనే భృతిని అందించాలని డిమాండ్ చేశారు. పూడికతీత జరిపిన ప్రాంతంలో నీరు నిలవడంతో ఒక బాలుడు మృతి చెందడం బాధాకరమని అభివర్ణిస్తూ బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూడికతీతకు సంబంధించిన ప్రతి అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని, లెక్కలు తేలే వరకు బిల్లులు ఆపాలని, అవినీతి అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.








