Mahaa Daily Exclusive

  మోగనున్న బడి గంట.. -నేటి నుంచి పాఠశాలలు పున ప్రారంభం -తొలి రోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ -బడిబాటతో సర్కారు బడుల్లో 2556 విద్యార్థుల చేరిక..!

Share

ఆదిలాబాద్, మహా

జిల్లాలో మరికొన్ని గంటల్లో బడిగంట మోగనుంది. వేసవి సెలవుల్లో ఆటపాటలతో ఉల్లాసంగా గడిపిన విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. సుమారు రెండు నెలల వేసవి సెలవుల అనంతరం గురువారం విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నెల 6వ తేదీ నుంచే బడిబాట కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉపాధ్యాయులు గ్రామాల బాట పట్టారు. వారి కృషి ఫలితంగా ఇప్పటి వరకు జిల్లాలో 2556 మంది విద్యార్థులు నూతనంగా సర్కారు బడుల్లో ప్రవేశం పొందారు. ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్న దృష్ట్యా మరింత మంది విద్యార్థులు చేరే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

బడులకు చేరిన పుస్తకాలు

సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు సైతం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. వీటితో పాటు మధ్యాహ్న భోజనం, సమరూప దుస్తులు అందిస్తోంది. జిల్లాలో విద్యార్థులకు 4,83,110 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 4,60,931 పుస్తకాలు చేరుకున్నాయి. ప్రస్తుతం మండల విద్యా వనరుల కేంద్రాలకు చేరుకోగా.. నేటి నుంచి వీటిని బడుల్లో విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు సమరూప దుస్తులకు కూడా తొలి రోజునే అందించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెల 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టగా.. ఇప్పటి వరకు జిల్లాలో 2556మంది విద్యార్థులు కొత్తగా చేరారు. ఇందులో కొంత మంది ఒకటో తరగతిలో కొత్తగా చేరగా.. మరికొంత మంది ఆయా ప్రైవేటు పాఠశాలల నుంచి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 19వరకు కొనసాగనున్న దృష్ట్యా మరింత మంది విద్యార్థులు చేరుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ముస్తాబైన బడులు

జిల్లాలో నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ సెక్టార్ పరిధిలో 1471 పాఠశాలలు ఉండగా 1,46,880 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో బాలురు 74,766 మంది, బాలికలు 72,114 మంది ఉన్నారు. కిందటి విద్యా సంవత్సరం ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట 12రకాల మౌళిక వసతులు కల్పించింది. అందమైన తరగతి గదులు, తాగునీటి వసతి, బల్లలు, టేబుల్ లు, అదనపు భవనాలు, మరుగుదొడ్లు, ప్రహారీగోడలు, విద్యుద్ధీకరణ తదితర పనులను చేపట్టింది. దీంతో సర్కారు బడుల్లోనూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులు కల్పించింది. వీటితో పాటు ఇటీవల ఉమ్మడి జిల్లాలో సుమారు 1200మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా నియమించడంతో సర్కారు చదువులకు భరోసా లభిస్తోంది. తల్లిదండ్రుల్లోనూ నమ్మకం ఏర్పడటంతో అనేక మంది సర్కారు బడుల వైపు మొగ్గుచూపుతున్నారు. వీటితో పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందజేస్తోంది. ఇక హాస్టల్ వసతి కలిగిన పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో నూతన మెనూ అమలు చేస్తోంది. ఇలా ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుండటం మూలంగా సర్కారు బడుల పట్ల అందరిలో సానుకూల వైఖరి వ్యక్తమవుతోంది.

పండగ వాతావరణంలో ఏర్పాట్లు

శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, ఆదిలాబాద్

జిల్లాలో నేటి నుంచి బడులు ప్రారంభం కానున్న దృష్ట్యా తొలి రోజున పండగ వాతావరణం తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో భోదనలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉండటంతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం. అంగన్ వాడీల నుంచి కొత్తగా విద్యార్థులను ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే బడిబాటతో అనేక మంది విద్యార్థులు కొత్తగా చేరారు. తల్లిదండ్రులు ఆలోచించి వారి పిల్లలను సర్కారు బడుల్లో చదివించాలి. నాణ్యమైన విద్యనందించేందుకు నిరంతరం కషి చేస్తాం.

Latest