వరంగల్ మహా;
వరంగల్ మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలోని పడమర కోటకి చెందిన గుర్రపు రామకృష్ణ ఇంట్లో ఆదివారం జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ఫిర్యాదు దారుడు రామకృష్ణ కుటుంబం హైదరాబాద్ కి ఫంక్షన్ కోసం వెళ్లి మరలా అదే రోజు రాత్రి 08.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా ఇంటిలో బీరువా తాళాలు తెరిచి కనిపించాయి. దీంతో వారు బీరువాను వెతకగా అందులో ఉండవలసిన మొత్తం 16 తులాల బంగారు బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే కేసునమోదు చేసి సెంట్రల్ జోన్ డీసీపీ సలీం బేగం ఆదేశాల మేరకు, వరంగల్ ఏసీపీ నందిరాం ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేశ్, సిబ్బంది వెంటనే దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని మంగళవారం ఉదయం పోర్ట్ రోడ్ జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు పోర్ట్ రోడ్ జంక్షన్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా నిందితుడు పోలీసులను చూసి పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకొని విచారించారని తెలిపారు. అతని వద్ద నుంచి 11.16 తులాల బంగారం రికవరీ చేశారని, నిందితుడు ఫిర్యాదుదారుడు గుర్రపు రామకృష్ణ కుమారుడేనని తెలిపారు. నిందితుడు తన గర్ల్ ఫ్రెండ్ తో జల్సాలు చేయడానికి డబ్బులు అవసరమైందని, అలాగే కొన్ని అప్పులు తీర్చేందుకు ఇంట్లో ఉన్న బంగారం ఎవరికి తెలియకుండా దొంగతనం చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారని తెలిపారు. దొంగతనం కేసుని ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేశ్ ను, ఎస్సెలు శ్రీకాంత్, సురేశ్, సిబ్బంది ప్రవీణ్ రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డు రఫీ, సిబ్బందిని వరంగల్ ఏసీపీ నందిరాం ప్రత్యేకంగా అభినందించారు.








