మహా : మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధ పడే వారి కోసం చేప మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే నేడు చేపప్రసాదం పంపిణీని ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. బత్తిని కుటుంబ సభ్యులు గత 178 సంవత్సరాలుగా చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నారు. మంత్రికి సైతం చేప మందు అందించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు ఇక్కడికి తరలి వస్తున్నారు. 13 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేస్తుండగా దాదాపు 42 క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. కాగా 2 రోజుల పాటు బత్తిని కుటుంబం పంపిణీ చేయనుంది. జీహెచ్ఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ పలు శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
భద్రత కోసం 70 సీసీ కెమెరాలు, వేయి మంది పోలీసుల వినియోగం
దాదాపు 70 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తూ 1000 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. వీఐపీల కోసం 4 గేట్లు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం 3 గేట్లు ఏర్పాటు చేశారు. అజంతా గేట్ నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పిస్తున్నారు. అంతే కాకుండా ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ల నుంచి చేప మందు పంపిణీ వద్దకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ చేప ప్రసాదం తీసుకునే వారు బత్తిని కుటుంబం సూచించిన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. నాలుగు సంవత్సరాల పాటు వరుసగా ఈ ప్రసాదం తీసుకోవాలి. శాఖాహారుల కోసం, చేపలకు బదులుగా బెల్లం తో తయారు చేసిన ప్రత్యేక ప్రసాదం అందుబాటులో ఉంటుంది. కాగా ఈ సంవత్సరం 5 నుంచి 6 లక్షల మంది ఈ చేప ప్రసాదం కోసం వస్తారని అంచనా వేస్తున్నారు.
అపశృతి, వృద్ధుడి మృతి
చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మెదక్ జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) వృద్ధుడు మృతి చెందాడు. ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడిన వృద్ధుడికి గుండెపోటు రావడంతో సృహతప్పి పడిపోయాడు. వెంటనే అందుబాటులో ఉన్న వైద్యులు పరీక్షించి , సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు విడిచిన వృద్ధుడు. వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.








