ఆదిలాబాద్, మహా:
జిల్లాలోని పోలీసు సిబ్బందికి అధునాతన, నూతన, సాంకేతికత పరిజ్ఞానం అందజేయడం జరిగిందని దానిని ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో వినియోగించుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ వారు డిజిటల్ ఇన్వెస్టిగేషన్ అండ్ సైబర్ ఫోరెన్సిక్ అంశంలో దేశ రాజధాని డిల్లీ లో వివిధ రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ పై పనిచేసే పోలీసు సిబ్బందికి 15 రోజుల పాటు పోలీసు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది పి గోపికృష్ణ – రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎం ఏ రియాజ్ – సైబర్ ల్యాబ్ కానిస్టేబుల్, జి త్రిశూల్ – సైబర్ ల్యాబ్ కానిస్టేబుల్ లు పాల్గొన్నారు. శిక్షణ కేంద్రంలో ఈ ముగ్గురిని మూడు వివిధ గ్రూపులలో ఉంచి అందజేసిన శిక్షణలో సిటిఎఫ్ పరీక్షలో పరీక్షలు నిర్వహించగా, ఏం ఏ రియాస్ నాయకత్వం వహించిన బృంద దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గోపికృష్ణ ఆధ్వర్యంలోని బృందం రెండవ స్థానం, త్రిశూల్ ఆధ్వర్యంలోని బృందం మూడవ స్థానాన్ని సా దించారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందిని ఆహ్వానించి, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. దేశంలోనే ఆదిలాబాద్ జిల్లా పోలీసు కీర్తి ప్రతిష్టలను శిఖర స్థాయికి తీసుకెళ్లినందుకు ప్రశంసించారు. జిల్లాలో పోలీసు సిబ్బందికి ప్రస్తుతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని, సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతున్న సైబర్ నేరాలను ప్రజలకు తెలియజేసి చైతన్య పరచాలని సూచించారు.








