ఆదిలాబాద్, మహా:
ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన వర్క్ అడ్జస్ట్మెంట్ (సర్దుబాటు) ఉత్తర్వులను సవరించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీ యూటీ ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘం కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 మంది విద్యార్థుల వరకు ఇద్దరే ఎస్జీటి ఉపాధ్యాయులను నియమించడం సమంజసం కాదన్నారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:20 కి తగ్గించాలన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఐదు గురు ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం బడిబాట జరుగుతున్న సందర్భంలో సర్దుబాటు చేయడం సరికాదన్నారు. బడిబాట తర్వాత విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ఈ పెరిగిన విద్యార్థుల సంఖ్య కనుగుణంగా సర్దుబాటు చేయాలన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ ల వల్ల చాలా పోస్టులు ఖాళీలయ్యాయని, విద్యా సంవత్సరానికి ముందే పదోన్నతులు కల్పించినట్లయితే ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుందన్నారు.పెండింగ్ డిఎ లను విడుదల చేయాలని, పిఆర్సి అమలు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.శ్రీకాంత్, ఎం.జలంధర్ రెడ్డి,రాష్ట్ర సహాధ్యక్షురాలు ఆర్.సుజాత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గండ్రత్ నారాయణ, ఆర్.రామారావు అర్ష రమేష్, బేర దేవన్న ఎంఈఓలు డి.సోమయ్య, కే. నర్సయ్య ,వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.








