మహా: ప్రశ్నిస్తున్న వాళ్లకు నోటీసులు ఇప్పించి బయపెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. అవినీతి విషయంలోనే అద్భుత ప్రగతి సాధిస్తున్నదని ధ్వజమెత్తారు. అన్ని శాఖల్లో కమీషన్లే వారి ఎజెండా అని మండిపడ్డారు. ఏ మంత్రి ఎంత సంపాదించాలి, సీఎం సీటుకు ఎట్లా పోటీపడాలన్న సోయి తప్ప మరొకటి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధిని పక్కనపెట్టి దోచుకునే విషయంలో పోటీపడుతున్నారని చెప్పారు. సూర్యాటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు, సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడిని ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. అందాల పోటీలతో ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీశారని, కేటీఆర్‌కు నోటీసులిస్తే బయపడతామనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ క్రేజ్ పెరుగుతుందని రేవంత్ ఏడుస్తున్నదన్నారు. నేషనల్ హెరాల్డ్ చార్జిషీట్‌లో రేవంత్ పేరును ఈడీ పేర్కొన్నప్పటికీ.. మోదీని కలవడానికి వెల్లాడంటేనే ఆయన బుద్ధి అర్ధమవుతుందన్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ దోస్తీ ఎట్లుందో తెలుస్తుందన్నారు. ఆ నాడు కేటీఆర్ స్వయంగా 8 గంటలు కూర్చుని చెప్పిన విషయం మీకు గుర్తుకులేదా అంటూ ప్రశ్నించారు. నోటీసులతో చిల్లర డ్రామాలు చేస్తూ మరింత నవ్వుల పాలవుతున్నారని, చిల్లర రాజకీయాలతో బీఆర్‌ఎస్ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేరని కామెంట్స్ చేశారు. మన నీళ్లను చంద్రబాబు తీసుకెళ్తుంటే సోయిలేదని, చిల్లర చేష్టలు మానుకొని ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదంటూ జగదీశ్ రెడ్డి కోరారు.








