Mahaa Daily Exclusive

  మూడేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం నల్గొండ జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..!

Share

నల్గొండ, మహా: నాలుగువేల కోట్ల రూపాయల వ్యయంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టడం జరిగిందని, అయితే అటువైపు నుంచి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి మూడు ఏళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రానున్న‌మూడేళ్ల‌లో ఎస్ఎల్‌బీసీ సొరంగం ప‌నులు పూర్తి చేసి జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తామ‌న్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటుచేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కో ఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా జి. యడవల్లి చెరువు తూము ఇతర పనుల మరమ్మతుకు కోటి రూపాయలను డీఎంఎఫ్‌టీ ద్వారా మంజూరు చేయడమే కాకుండా రేపటి నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ లాంటి దేశాలు న్యూక్లియర్, థర్మల్ విద్యుత్తును పక్కన పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వెళుతున్నారని అన్నారు. మహిళలు ఇంటి వద్దనుండే ఆదాయం పొందేందుకు సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేశామని.. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలను లక్షాధికారులుగా చేశామని అన్నారు కోమటిరెడ్డి.
సోలార్ విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు..
ఎడవల్లి గ్రామంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో 80 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామ‌ని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీనితోపాటు, 5 కోట్ల రూపాయలతో బీటి రోడ్లు, 30 లక్షల తో డ్రైనేజీ మంజూరు చేశామని తెలిపారు. ఎడవల్లి చెరువు మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కనగల్ ఆస్పత్రిలో గ్లూకోమా కంటి పరీక్షలకు అధునాతన యంత్రం ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. జిల్లా ఆస్పత్రి మాదిరిగా కనగల్ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగిందని వెల్లడించారు. కనగల్ మండల మహిళా సమాఖ్య సభ్యులకు అయిటి పాములలో లాగే సోలార్ విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏవైనా సమస్యలు ఉంటే మండల ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ పద్మ, ఇంజనీరింగ్ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.

Latest