ఖమ్మం – మహా.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష విపత్తుల దెబ్బతీసిన సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, మరమ్మత్తుల కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధుల మంజూరుపై ఆకాంక్ష వ్యక్తం చేశారు. వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీ వంటి భారీ ప్రాజెక్టులపై కేంద్ర బిందువుగా పనిచేస్తున్న తుమ్మల, తన రాజకీయం సాగునీటి కలలను సాకారం చేయడమేనని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదల వల్ల దెబ్బతిన్న ఎన్ఎస్పీ కాలువలు, పెద్దవాగు, వెంగళరాయసాగర్ ప్రాజెక్టులకు అత్యవసర నిధుల అవసరం ఉందని, రైతులకు వచ్చే వానాకాలంలో సాగునీరు అందించేందుకు ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మౌలికసదుపాయాల పునరుద్ధరణతో పాటు, రాష్ట్ర నీటి సంచాలన వ్యూహంలో గోదావరి జలాలను సమర్థంగా వినియోగించేందుకు తుమ్మల చేస్తున్న నిస్వార్థ ప్రయత్నం రాష్ట్ర సాగునీటి భవిష్యత్తును నిర్ణయించనుంది.
వానాకాలం ముంచుకొస్తుండగా ఖమ్మం జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల మరమ్మత్తులకు నిధుల కేటాయింపుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. గత సెప్టెంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలు భారీగా వరదలు తెచ్చిపెట్టడంతో ఎన్నో ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
* ఎన్‌ఎస్‌పీ కాలువల మరమ్మత్తులు:
ఎన్ఎస్పీ ప్రాజెక్టు కాలువలు అనేకచోట్ల కూలిపోయిన నేపథ్యంలో, రైతులకు సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కాలువల మరమ్మత్తులు వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని మంత్రి తక్షణ చర్యలకు పిలుపునిచ్చారు.
* పెద్దవాగు ప్రాజెక్టు నిధులు:
అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు గేటు తుడిచిపోయి బండ్ తెగిపోవడంతో రైతులందరికి సాగు అనిశ్చితమైంది. తాత్కాలిక మరమ్మత్తులకు రూ.3.50 కోట్లు, శాశ్వత పునర్నిర్మాణానికి రూ.90 కోట్లు అవసరమని, ఆ నిధులకోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 2,600 ఎకరాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 12,000 ఎకరాలకు సాగునీరు అందుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల సమన్వయంతో నిధుల కేటాయింపు జరగాలని కోరారు.
* వెంగళరాయసాగర్ పరిస్థితి:
చంద్రుగొండ మండలంలోని సీతా గ్రామంలో ఉన్న వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కూడా వరదల బారిన పడినదని, దీని పునరుద్ధరణకూ నిధులు మంజూరు చేయాలని తుమ్మల సూచించారు.
* సీతారామ ఎత్తిపోతల పథకం:
గోదావరి జలాలను ఉపయోగించేందుకు రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్‌ను ఆమోదించాలని కోరారు. ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న పరిపాలనా అనుమతులకు తక్షణ నిర్ణయం తీసుకొని పనులు వేగంగా ప్రారంభించాలన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరు అందించాలంటే ఈ ప్రాజెక్టులు పూర్తికావాల్సిన అవసరం ఉందన్నారు.
* సీతమ్మసాగర్ వ్యూహం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మించనున్న సీతమ్మసాగర్ బ్యారేజీ వెనుక జలాలను ఆధారంగా తీసుకొని సాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించారని వెల్లడించారు. ఇప్పటికే టీఏసీ అనుమతులు లభించినట్లు, త్వరితగతిన పనులు ప్రారంభించాలన్నారు.
* తుమ్మల కల – ఖమ్మం కళ:
“ఖమ్మం గుమ్మంలో సీతారామం పరవళ్ళు తొక్కాలని నా కల,” అని తుమ్మల పేర్కొన్నారు. రైతు సంక్షేమమే తన పాలనా ధ్యేయమని స్పష్టంచేశారు. లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేయడం ద్వారా రైతులకు ఆశావహ భవిష్యత్తు కట్టడమే తన లక్ష్యమని తెలిపారు.








