Mahaa Daily Exclusive

  గంభీరావుపేట మండలంలోని నర్మాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కమార్…!

Share

సిరిసిల్ల, మహా:

‘‘సంజయ్ సారూ….మా బాధలు చూడటానికి ఈడకొచ్చిర్రు. ఎన్నని చెప్పమంటరు. మా గోస వర్ణణాతీతం. అప్పు పుడతలేదు…రైతు అని చెబితే పిల్లనిస్తలేరు… 32 క్వింటాలు రావాల్సిన పంట దిగుబడి తగ్గింది… ఈసారి 20 క్వింటాలలోపే దిగుబడి వచ్చింది. అవైనా అమ్ముకుందామని ఈడకొస్తే కొనే దిక్కేలేదు. వానొస్తే భయమైతది. గాలొస్తే భయమైతది. వడ్లపై కప్పుదామంటే నిన్నటిదాకా టార్పాలిన్ కూడా ఇయ్య లేదు…క్వింటాలుకు 5 కిలోలు కోత పెడుతున్నారు. ఇగ మమ్ముల్ని ఆదుకునేదెవరు?’’ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎదుట రైతులు గోడు వెళ్లబోసుకున్న తీరిది.

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఐకేపీ సెంటర్ ను సందర్శించి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు సంజయ్ ను కలిసి తమ బాధలు చెప్పుకుంటూ వాపోయారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తప్పుపట్టారు. వడ్ల పైసలన్ని కేంద్రమే చెల్లిస్తోందని, అయినా వడ్ల కొనుగోలును త్వరగా పూర్తి చేయకుండా జాప్యం చేయడమేందని ప్రశ్నించారు. రైతుల కన్నీళ్లు కనబడతలేవా? వాళ్ల గుండె రోదన వినబడటం లేదా? అని మండిపడ్డారు.

కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 500లకుపైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 45 రోజులు దాటినా ఇంతవరకు పూర్తిస్థాయిలో వడ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ రెండు జిల్లాల్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనాల్సి ఉండగా ఇప్పటి వరకు సగం కూడా కొనలేదన్నారు. వడ్లను కొన్న తరువాత నెలరోజులైనా రైతుల ఖాతాల్లో పైసలు జమ చేయడం లేదని, ఇట్లయితే రైతులు బతికేదెలా? అని ప్రశ్నించారు.

వడ్ల కొనుగోలులోనూ రాజకీయం జోక్యం ఎక్కువైందన్నారు. ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతుంటే ‘‘నాతో ఏమీ కాదు… నా దగ్గర పైసల్లేవ్’’అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. ‘‘అయినా వడ్ల కొనుగోలు పైసలన్నీ మిత్తీతోసహా కేంద్రమే చెల్లిస్తోంది. 10 ఏళ్లలో వడ్ల కొనుగోలు కోసమే లక్షన్నర కోట్ల రూపాయలు చెల్లించింది. అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? రైతులను ఎందుకు అరిగోస పెడుతున్నారు?’’అని ప్రశ్నించారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ద ప్రాతిపదికన వడ్లను కొనుగోలు చేయాలని, వెంట వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన వడ్లతోసహా ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు ఉపశమనం కలిగించాలని కోరారు.

Latest