Mahaa Daily Exclusive

  ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాల అభివృద్ధి ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ – సీఎం రేవంత్

Share

తెలంగాణను రాబోయే పదేళ్లలో ఒక ట్రిలియన్‌ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందన్నారు. బయో ఆసియా సదస్సుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ ప్రసిద్ధ ఫార్మా, హెల్త్‌కేర్‌ కంపెనీలు, లైఫ్ సైన్సెస్‌, బయోటెక్‌ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రెండు రోజుల పాటు జరుగనున్న బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరై ప్రసంగించారు. సీఎం రేవంత్‌తో పాటు ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, స్పెషల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, హెల్త్‌కేర్‌ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఆసియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందని తెలిపారు. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్, బయోటెక్‌ కంపెనీలు ఎన్నో హైదరాబాద్‌ నుంచి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ముందు నుంచి పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్‌ వివరించారు.

నిపుణుల కృషితో జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటు చేసుకున్నామని సీఎం తెలిపారు. పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మారుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ సహా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. భారత్‌లోనే ఎలక్ట్రిక్‌ వాహనాల రాజధానిగా హైదరాబాద్‌ మారిందన్నారు. దేశంలోనే అత్యధిక ఈవీల విక్రయం హైదరాబాద్‌లోనే నమోదైందని అన్నారు. తెలంగాణలో ఆర్టీసీలోకి 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తెస్తున్నామని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా చేస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం. ఓఆర్ఆర్‌, ఆర్ఆర్ఆర్‌లను రేడియల్ రోడ్లతో అనుసంధానం చేస్తాం. రేడియల్ రోడ్లకు ఇరువైపులా క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేస్తాం. ఏపీలోని పోర్టుకు కలిపేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా కల్పిస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. బయో సైన్సెస్‌, బయోటెక్‌, లైఫ్‌ సైన్సెస్‌ కేంద్రంగా హైదరాబాద్‌ మారాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఆవిష్కరణలు, పరిశోదన, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా హైదరాబాద్‌ మారాలన్నారు. అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు విస్తరించిందని చెప్పారు. ఆయా కంపెనీలు ఇక్కడి అనుకూలతలు, ప్రభుత్వ సహకారం అందుకోవాలని సూచించారు. తమతో భాగస్వాములు కావాలని దిగ్గజ కంపెనీలను కోరుతున్నామని చెప్పారు. సులభతర పారిశ్రామిక విధానంతో మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Latest